ఈజిప్టులో ఆయిల్ ట్యాంకర్‌పై హైటెన్షన్ వైర్లు పడి 31 మంది సజీవదహనం

ప్రతిపక్షం, నవంబర్ 26: ఈజిప్టు రాజధాని కైరోలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రద్దీగా ఉండే రింగ్‌ రోడ్డుపై ఆయిల్ ట్యాంకర్‌తో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడి మంటలు చెలరేగడంతో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి పైగా గాయపడ్డారు. ఆయిల్ ట్యాంకర్‌పై హైటెన్షన్ విద్యుత్ తీగలు పడటంతో ప్రమాదం సంభవించినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలోని వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.

బుధవారం జరిగిన ఈ ఘటన జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతానికి సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఆయిల్‌తో నిండిన ట్యాంకర్ ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడటంతో మంటలు చెలరేగినట్లు ఈజిప్టు ఆరోగ్య శాఖ తెలిపింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు ట్యాంకర్‌పై పడటంతో మంటలు మరింత తీవ్రరూపం దాల్చినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. అగ్నికీలలు క్షణాల్లో సమీపంలోని వాహనాలకు వ్యాపించడంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. రెండు డజన్లకు పైగా కార్లు, మోటార్ సైకిళ్లు పూర్తిగా కాలిపోయి ఇనుప శిథిలాలుగా మారాయి.

ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై భారీగా వాహనాలు ఉండటంతో పరిస్థితి భయానకంగా మారింది. ఎటుచూసినా మంటలు, దట్టమైన పొగ అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కొందరు వాహనాలను వదిలి పరుగులు తీశారు. మరికొందరు హారన్లు మోగిస్తూ తమ వాహనాలను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి. చుట్టుపక్కల భవనాలకు మంటలు వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాయి. మొత్తం 39 అంబులెన్సులను ప్రమాద స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 21 మందిని ఆసుపత్రులకు తరలించగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. మిగిలిన క్షతగాత్రులకు కూడా వైద్యసేవలు అందిస్తున్నారు.

మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఈజిప్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది. బాధితుల వివరాలను నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈజిప్టు ఆరోగ్య శాఖ మంత్రి ఖలీద్ అబ్దెల్ గఫార్ ప్రమాద స్థలాన్ని సందర్శించడంతోపాటు, గాయపడిన వారు చికిత్స పొందుతున్న ఆసుపత్రులకు వెళ్లి వైద్య సేవలను పరిశీలించారు. బాధితులకు అవసరమైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను పూర్తిస్థాయిలో విచారించాలని ఈజిప్టు ప్రధానమంత్రి ముస్తఫా మద్బౌలీ ఆదేశాలు జారీ చేశారు. పెట్రోలియం ఉత్పత్తుల రవాణా సమయంలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ తరహా ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని అధికార ప్రతినిధి తెలిపారు.

ఇటీవలి సంవత్సరాల్లో ఈజిప్టులో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అనధికారిక నివాస ప్రాంతాలు, పాతబడిన మౌలిక సదుపాయాలు, అగ్నిప్రమాదాలను ఎదుర్కొనే వ్యవస్థల్లో లోపాలు ప్రమాద తీవ్రతను పెంచుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లో అత్యవసరంగా బయటపడేందుకు ప్రత్యేక మార్గాలు, పొగను గుర్తించే పరికరాలు, హెచ్చరిక అలారాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఇరుకైన రహదారుల కారణంగా అగ్నిమాపక వాహనాలు ప్రమాద స్థలాలకు చేరుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా కైరోలో జరిగిన ఈ ఘోర ప్రమాదం రవాణా భద్రతతోపాటు అగ్నిమాపక, అత్యవసర సహాయక వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మరోసారి స్పష్టం చేసింది.

Related News

Latest News