కృష్ణా జలాల కోసం డిసెంబర్ 10న బీఆర్‌ఎస్ సమరశంఖం

ప్రతిపక్షం, నవంబర్ 25: కృష్ణా నదీ జలాల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి మరోసారి ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతో చేపడుతున్న నిర్మాణాల నేపథ్యంలో తెలంగాణ నీటి ప్రయోజనాలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్.. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే నెల డిసెంబర్ 10న నల్లగొండలో ‘నల్లగొండ నగారా’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ సభ ద్వారా కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం మరోసారి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

పల్నాడు వాటర్ గ్రిడ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలు నాగార్జునసాగర్ ఆయకట్టుతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల తాగునీటి, సాగునీటి అవసరాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంతో పాటు రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు అందాల్సిన కృష్ణా జలాల విషయంలో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కేటీఆర్ నాయకత్వంలో భారీ బహిరంగ సభ

డిసెంబర్ 10న నిర్వహించనున్న ‘నల్లగొండ నగారా’ సభకు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరుకానున్నారు. లక్షలాది మందిని సమీకరించి తెలంగాణకు జరుగుతున్న నీటి అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ సభలో పల్నాడు వాటర్ గ్రిడ్ అంశంతో పాటు కృష్ణా జలాల పంపిణీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రయోజనాలు, తెలంగాణకు రావాల్సిన నీటి వాటా తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న నిర్మాణాలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేయనున్నారు.

గతంలోనూ నల్లగొండ నుంచే జల ఉద్యమం

బీఆర్‌ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన తొలినాళ్లలో కూడా కృష్ణా జలాల అంశంపై నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. కృష్ణా ప్రాజెక్టులను నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించవద్దని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఆ సభలో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్.. తెలంగాణ నీటి ప్రయోజనాలకు భంగం కలిగితే సహించబోమని స్పష్టం చేశారు. ఆ సభ అనంతరం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని బీఆర్‌ఎస్ నాయకులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు మరోసారి నల్లగొండ నుంచే కృష్ణా జలాల పోరాటానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు వినతిపత్రం

పల్నాడు వాటర్ గ్రిడ్ అంశంపై బీఆర్‌ఎస్ ఇప్పటికే అధికారికంగా తన అభ్యంతరాలను తెలియజేసింది. నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పార్టీ ప్రతినిధుల బృందం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందించింది. ఆంధ్రప్రదేశ్‌లో పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతో చేపడుతున్న నిర్మాణాల పనులను తక్షణమే నిలిపివేయించాలని, తెలంగాణ నీటి హక్కులకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలు, నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది.

ప్రజా ఉద్యమంగా మార్చేందుకు కార్యాచరణ

ఈ అంశంపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని బీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తోంది. నల్లగొండ సభకు పెద్దఎత్తున ప్రజలను తరలించి తెలంగాణ నీటి హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని యోచిస్తోంది. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ నుంచే ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని, డిసెంబర్ 10న కేటీఆర్ నాయకత్వంలో లక్షలాది మందితో సభ నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామని వెల్లడించారు.

మొత్తంగా పల్నాడు వాటర్ గ్రిడ్ వివాదం నేపథ్యంలో కృష్ణా జలాల అంశం మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. ఈ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిలదీయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న నిర్మాణాలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. డిసెంబర్ 10న జరగనున్న ‘నల్లగొండ నగారా’ సభతో ఈ అంశాన్ని రాష్ట్రవ్యాప్త చర్చగా మార్చేందుకు పార్టీ సిద్ధమవుతోంది.

Related News

Latest News