[t4b-ticker]

ఉద్యోగార్థులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. ఇకపై ఆరు నెలలకోసారి పోటీ పరీక్షలు

ప్రతిపక్షం, ఆగస్టు 15, సంగారెడ్డి: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సీఎం సూచించారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

రాష్ట్రంలో పేదలు ఆకలితో బాధపడకూడదన్న ఉద్దేశంతో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని వెల్లడించారు. సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత మార్కెట్‌లో వాటి ధరలు కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకు తగ్గాయని పేర్కొన్నారు.

రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయం దండగ కాదని, పండుగగా మార్చాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంపై రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పంటల కొనుగోళ్ల కోసం రూ.90 వేల కోట్లు చెల్లించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచామని తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్లు జమ చేసి 25 లక్షల మంది రైతులను రుణభారం నుంచి విముక్తి చేశామని పేర్కొన్నారు.

రైతు భరోసా మొత్తాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచి రూ.36 వేల కోట్లు అందించామని సీఎం తెలిపారు. రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

మహిళా సాధికారతకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీతో రూ.60 వేల కోట్ల బ్యాంకు రుణ అనుసంధానం కల్పించామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం రూ.11 వేల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. 27 లక్షల మంది విద్యార్థులకు పాఠశాల దుస్తులు కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించామని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తొలి విడతగా 4.5 లక్షల ఇళ్లను, రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను కేటాయించినట్లు సీఎం తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, సికిల్ సెల్ అనీమియా బాధితులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

ఉద్యోగాల భర్తీపై సీఎం మరోసారి స్పష్టత ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇటీవల మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపారు. ఇకపై ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తామని చెప్పారు.

“ఏ ఉద్యోగ ఖాళీని గాలికి వదిలిపెట్టం. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. యువత ఇప్పటి నుంచే పరీక్షలకు సిద్ధం కావాలి. పరీక్షలు నిర్వహించి, నియామకాలు పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వానిదే” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు ప్రతి ఏడాది రూ.75 వేల కోట్లు చెల్లిస్తున్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని సీఎం తెలిపారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల ఆశీర్వాదంతో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Spread the love

Related News

Latest News