ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, సెప్టెంబర్ 30: కరీంనగర్లో రూ.51 కోట్లతో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
రూ.29.62 కోట్లతో జిల్లాలో చేపడుతున్న మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణ పనులకు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.840 కోట్లతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు, కే.ఎస్.సీ.సీ.ఎల్. స్పెషల్ గ్రాంట్స్ కింద రూ.21.60 కోట్లతో చేపట్టిన వరదనీటి మురుగు కాల్వల నిర్మాణ పనులకు, రూ.25 కోట్లతో చేపట్టనున్న మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ బిల్డింగ్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.అదేవిధంగా రూ.5.70 కోట్లతో నిర్మించిన సెంట్రల్ లైబ్రరీ భవనాన్ని, రూ.6.50 కోట్లతో నిర్మించిన కాశ్మీర్ గడ్డ సమీకృత వెజ్–నాన్ వెజ్ మార్కెట్‌ను, రూ.16.50 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డిఆర్ఎఫ్ కార్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.





























