శృంగేరి జగద్గురువులు నిర్ణయించిన ముహూర్తంలో శ్రీకారం
శృంగేరి పీఠంలో ప్రత్యేక శిలాన్యాసపూజ
నవంబర్ 20న ఉదయం 9.30 గంటలకు పనుల ప్రారంభం
ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబర్ 26: వెయ్యేళ్ల చరిత్ర.. ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక.. పాలమాకుల శ్రీ శంభు దేవాలయానికి పునర్వైభవం తీసుకొచ్చే మహత్తర ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శృంగేరి జగద్గురువు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు నిర్ణయించిన శుభ ముహూర్తం మేరకు నవంబర్ 20న ఉదయం 9.30 గంటలకు ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ జనమంచి సీతారామ శర్మ ద్వివేది వెల్లడించారు. జగద్గురువుల ఆశీస్సులతో చేపట్టనున్న ఈ మహత్తర కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు.
శృంగేరి పీఠంలో ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శృంగేరి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారి ఆశీస్సులతో, శ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి సమక్షంలో కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి పీఠంలో లక్ష్మీ గణపతి పురశ్చరణ యాగాన్ని నిర్వహించినట్లు జనమంచి సీతారామ శర్మ ద్వివేది వివరించారు. దేవాలయ పునర్నిర్మాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
పునర్నిర్మాణానికి సంబంధించిన శిలాన్యాసం కోసం జగద్గురువులు స్వయంగా శిలలను పూజించి అందించడంతో పాటు తమ ఆశీస్సులు అందించినట్లు తెలిపారు. జగద్గురువుల ఆశీస్సులతో ప్రారంభం కానున్న ఈ పునర్నిర్మాణ కార్యక్రమం పాలమాకుల గ్రామానికే కాకుండా పరిసర ప్రాంతాల భక్తులకు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్ఠమైనదని పేర్కొన్నారు.
వెయ్యేళ్ల చరిత్రకు పునర్వైభవం
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శ్రీ శంభు దేవాలయం పునర్నిర్మాణంతో ప్రాచీన ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు అందించే అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు. సిద్ధిపేట ప్రాంతంలో ఇంతటి ప్రాచీన దేవాలయం ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. దాని పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.దేవాలయ నిర్మాణం కేవలం ఒక కట్టడం నిర్మించడమే కాదన్నారు. సనాతన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షించే పవిత్ర కార్యక్రమమని వివరించారు. భక్తులు, దాతలు, గ్రామ ప్రజలు తమకు తోచిన విధంగా సహకరించి పునర్నిర్మాణ పనులను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
భక్తులు, దాతలు భాగస్వాములు కావాలి
శ్రీ శంభు దేవాలయ పునర్నిర్మాణానికి భక్తులు, దాతలు, ఆధ్యాత్మికవేత్తలు, గ్రామ ప్రజలు ముందుకు రావాలని జనమంచి సీతారామ శర్మ ద్వివేది పిలుపునిచ్చారు. అందరి సహకారంతో దేవాలయాన్ని పునర్వైభవం దిశగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర కార్యంలో భాగస్వాములై శ్రీ శంభు దేవుడి కృపతోపాటు శృంగేరి జగద్గురువుల ఆశీస్సులు పొందాలని కోరారు. నవంబర్ 20వ తేదీన ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్న పునర్నిర్మాణ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






























