రైలు.. గోదావరి.. జిల్లా.. ప్రజల ఆశయాలను నిజం చేశాం
త్వరలోనే యూనివర్సిటీని సాధిస్తాం
దసరా వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్ రావు
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 20: ఒకప్పుడు ఎన్నికల నినాదాలుగా, గోడల మీద రాతలుగా మిగిలిన రైలు, గోదావరి జలాలు, జిల్లా ఏర్పాటు కలలు నేడు సాకారమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట అభివృద్ధి ప్రస్థానం ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు. ఉన్నత విద్యకు మరింత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. త్వరలోనే సిద్దిపేటకు యూనివర్సిటీని సాధిస్తామని ప్రకటించారు. విజయదశమి సందర్భంగా సిద్ధిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నిర్వహించిన రావణ దహన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఘనంగా దసరా వేడుకలు
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్ధిపేట పట్టణంలోని నర్సాపూర్, రంగదాంపల్లి, ఎన్సాన్పల్లి, రూరల్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ దుర్గా మాత, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి పూజ అనంతరం రావణ దహనం చేశారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, యువత, మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీక అన్నారు. జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం తెలంగాణ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు. దుర్గామాత ఆశీస్సులతో సిద్ధిపేట ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఉద్యమాల గడ్డ.. అభివృద్ధికి చిరునామా
తెలంగాణ ఉద్యమంలోనూ, రాష్ట్ర అభివృద్ధిలోనూ సిద్ధిపేటకు ప్రత్యేక స్థానం ఉందని హరీశ్‌రావు అన్నారు. 1969 తొలిదశ ఉద్యమం నుంచి కేసీఆర్ నాయకత్వంలోని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు సిద్ధిపేట ప్రజలు ముందుండి పోరాడారని గుర్తుచేశారు.
ఒకప్పుడు సిద్ధిపేటకు రైలు రావాలని, గోదావరి జలాలు పారాలని, ప్రత్యేక జిల్లా కావాలని ప్రజలు కోరుకునేవారని చెప్పారు. ఆ ఆకాంక్షలు నేడు నెరవేరాయని పేర్కొన్నారు. ప్రజల ప్రేమ, ఆశీస్సులే ఈ అభివృద్ధికి బలమని అన్నారు.
సిద్ధిపేట గడపకు చేరిన రైలు
సిద్ధిపేటకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి రావడం చారిత్రక పరిణామమని హరీశ్‌రావు అన్నారు. ఒకప్పుడు రైలును చూడాలంటే హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని గుర్తుచేశారు. నేడు నర్సాపూర్, రంగదాంపల్లి సమీపంలోనే రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు. సుమారు రూ.400 కోట్లతో రైల్వే విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. మరో ఏడాది, రెండేళ్లలో విద్యుత్ రైళ్లతో సిద్ధిపేట నుంచి ఢిల్లీ, తిరుపతి వంటి ప్రాంతాలకు నేరుగా ప్రయాణించే అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రైల్వే కనెక్టివిటీ మరింత విస్తరిస్తుందని పేర్కొన్నారు.
గోదావరి జలాలతో తీరిన నీటి కష్టాలు
గతంలో సిద్ధిపేట ప్రాంతంలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారని హరీశ్ రావు గుర్తుచేశారు. వందల అడుగుల లోతులో బోర్లు వేసినా నీరు లభించని పరిస్థితులు ఉండేవని అన్నారు. బతుకమ్మ పండుగ సమయంలో చెరువుల్లో నీరు లేక ఆడబిడ్డలు ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్ సహా జలాశయాల నిర్మాణం, గోదావరి జలాల తరలింపుతో పరిస్థితి మారిందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా మెరుగు పడిందన్నారు. గౌరవెల్లి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, అనంతగిరి రిజర్వాయర్లు ప్రాంతానికి నీటి భద్రతను అందిస్తున్నాయని వివరించారు.
కోమటి చెరువు అభివృద్ధి
నీటి లభ్యతతో సిద్ధిపేట రూపురేఖలు మారాయని అన్నారు. గతంలో నీటి సమస్యలతో ఇబ్బందులు పడిన ప్రాంతం నేడు సాగునీరు, తాగునీటి సౌకర్యాల పరంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
50 వేల టన్నుల నుంచి 5 లక్షల టన్నులకు
గోదావరి జలాల రాకతో వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పు వచ్చిందని హరీశ్ రావు అన్నారు. గతంలో సిద్ధిపేట ప్రాంతంలో సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మాత్రమే ఉత్పత్తి అయ్యేదని చెప్పారు. నీటి వసతులు మెరుగు పడటంతో బీడు భూములు పచ్చని పంట పొలాలుగా మారాయని వివరించారు.
గత ఏడాది వరి ధాన్యం ఉత్పత్తి ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో సిద్ధిపేట జిల్లా రాష్ట్రంలో అగ్రగామిగా నిలవడం రైతుల కష్టానికి నిదర్శనమన్నారు. సాగునీటి సదుపాయాలు వ్యవసాయానికి కొత్త ఊపునిచ్చాయని చెప్పారు.
అభివృద్ధిలో కొత్త రూపు
ఒకప్పుడు చిన్న పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని హరీశ్‌రావు అన్నారు. నేడు సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, సిద్ధిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వంటి సంస్థలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.
పట్టణంలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య నిర్వహణలో మార్పులు వచ్చాయని వివరించారు. గతంలో ఇరుకైన వీధులు, మురికి కాలువలతో ప్రజలు ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డివైడర్లు, పచ్చదనంతో పట్టణం కొత్త రూపు సంతరించుకుందని అన్నారు.
పేదింటి బిడ్డలకూ వైద్య విద్య
విద్యారంగంలో సిద్ధిపేట సాధించిన పురోగతిని హరీశ్‌రావు వివరించారు. మెడికల్, నర్సింగ్, పారామెడికల్, బి.ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ, పీజీ, మహిళా డిగ్రీ కళాశాలలతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ విద్యా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.
పేదరికం వైద్య విద్యకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. జిల్లాలో మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటు పేద విద్యార్థులకు అవకాశాలు కల్పించిందని అన్నారు.
రంగదాంపల్లిలో తండ్రిని కోల్పోయి, తల్లి హోటల్లో కూలీగా పనిచేసే నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వైద్య విద్యలో ప్రవేశం పొందడం సంతోషకరమని చెప్పారు. నర్సాపూర్‌లో టైలర్ కుటుంబానికి చెందిన నలుగురు ఆడపిల్లలు ఎంబీబీఎస్ చదువుతున్నారని వివరించారు. ఇలాంటి ఉదాహరణలు విద్యారంగంలో వచ్చిన మార్పును చాటుతున్నాయన్నారు.
తదుపరి లక్ష్యం యూనివర్సిటీ
సిద్ధిపేట జిల్లా ఏర్పాటైంది. గోదావరి జలాలు అందుబాటులోకి వచ్చాయి. రైల్వే సౌకర్యం వచ్చింది. ఉన్నత విద్యా సంస్థలతో విద్యాకేంద్రంగా ఎదిగింది. ఇక సిద్ధిపేటకు యూనివర్సిటీ రావాల్సి ఉందని హరీశ్ రావు అన్నారు. ప్రజల ఆశీస్సులతో ఆ లక్ష్యాన్ని సాధిస్తామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీ ఏర్పాటుతో ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని చెప్పారు. స్థానిక విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంప్రదాయాలకు పెద్దపీట
నర్సాపూర్‌లో గత 37 ఏళ్లుగా శక్తి సేవా సమితి యూత్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని హరీశ్‌రావు అన్నారు. రంగదాంపల్లిలో హనుమాన్ టెంపుల్ కమిటీ, గ్రామ పెద్దలు, యువత సమష్టిగా వేడుకలను కొనసాగించడం ప్రశంసనీయమన్నారు.
సంప్రదాయాలను కాపాడుకుంటూనే అభివృద్ధిలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఉంటూ పండుగ కోసం సొంతూళ్లకు వచ్చిన కుటుంబాలకు విజయదశమి శుభాలు కలగాలని ఆకాంక్షించారు. సిద్దిపేట మరింత అభివృద్ధి చెందాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.






































