భీమేశ్వరస్వామి ఆలయం పక్కనే శ్రీ శివసాయి ప్రైవేట్ దందా
వాహనానికి రూ.100 వసూలు
నాయకులు, అధికారుల అండదండలతోనే అక్రమ వసూళ్ల పర్వం?
వేములవాడ, ప్రతిపక్షం, నవంబర్ 26: ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం, భీమేశ్వర సదన్ పక్కన ఏర్పాటు చేసిన శ్రీ శివసాయి (JSR) ప్రైవేట్ పార్కింగ్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే గత ఆరు నెలలుగా పార్కింగ్ నిర్వహిస్తూ, భక్తుల నుంచి ఒక్కో వాహనానికి రూ.100 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి వచ్చే ప్రధాన రహదారిని ఆనుకుని బారికేడ్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మరీ ఈ దందా సాగిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రసీదులు ముద్రించి, ప్రైవేట్ సిబ్బందితో దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తుండటంతో పాటు ఆలయ పరిసరాల్లో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఫిర్యాదు చేసినా పట్టింపు కరవు
ఈ అక్రమ పార్కింగ్ వసూళ్లపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కొందరు స్థానిక నాయకులు, అధికారుల అండదండలు ఉండటం వల్లే నిర్వాహకులు ఇంత బహిరంగంగా నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
పెనాల్టీపై కమిషనర్ దాటవేత:
ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్‌ను ఫోన్ ద్వారా వివరణ కోరగా.. సదరు ప్రైవేట్ పార్కింగ్‌కు ఇప్పటివరకు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. పార్కింగ్ నిర్వాహకుడిని పిలిపించి ప్రశ్నించగా, తాను ఈరోజు దరఖాస్తు చేసుకుంటానని చెప్పినట్లు వెల్లడించారు. అయితే, ఆరు నెలలుగా అనుమతులు లేకుండా పార్కింగ్ నడిపినందుకు నిర్వాహకులపై పెనాల్టీ విధిస్తారా? అని ప్రశ్నించగా.. ‘ఈ విషయంపై చర్చించి నిర్ణయం చెబుతాం’ అని కమిషనర్ దాటవేత ధోరణిలో సమాధానం ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.
చిరు వ్యాపారులకేనా నిబంధనలు?:
పట్టణంలో ఆరు నెలలుగా అనుమతులు లేని ప్రైవేట్ పార్కింగ్ నడుస్తున్నా పట్టించుకోని మున్సిపల్ అధికారులు.. పొట్టకూటి కోసం రోడ్ల పక్కన వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు చిన్నపాటి తప్పు చేసినా వెంటనే భారీ జరిమానాలు విధిస్తున్నారని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. పెద్దల అండ ఉన్న పార్కింగ్ నిర్వాహకుల విషయంలో కనిపించని కఠినత్వం సామాన్య చిరు వ్యాపారుల విషయంలోనే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ పార్కింగ్‌పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, భక్తులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






























