పంట నష్ట పరిహారంపై ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించాలి

క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగానే రైతుల గుర్తింపు చేపట్టాలి

ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి.. ప్రజాసంఘాల డిమాండ్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 12: ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోయి రైతుల బతుకులు దయనీయంగా మారాయని, పంట నష్టపరిహారం చెల్లింపుపై ప్రభుత్వం తక్షణమే విధాన నిర్ణయం ప్రకటించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన సర్వేలు, నివేదికల ఆధారంగానే పంట నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం అందించాలని కోరారు.గురువారం మెదక్ జిల్లా చేగుంట, నార్సింగి, రామాయంపేట మండలాల్లో మెదక్ సిటిజన్స్ ఫోరం నాయకులు కొండల్ రెడ్డి, పీడీ ఆనందం, సీపీఎం నాయకులు మల్లేష్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ అహ్మద్, తెలంగాణ రక్షణ సేన నాయకులు బట్టి అజయ్, జర్నలిస్టుల సంఘం నాయకుడు బొందుగుల నాగరాజు, రైతు స్వరాజ్య వేదిక నాయకుడు బాగయ్య పర్యటించారు.

ఈ సందర్భంగా చిట్టోజిపల్లి, నర్సంపల్లి, సుతారిపల్లి గ్రామాల్లో పంటలు నష్టపోయిన రైతులను నేరుగా కలిసి ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రైతుల సమస్యలు, సాగు పెట్టుబడులు, పంట నష్టంపై వారి ఆవేదనను అడిగి తెలుసుకున్నారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ కరువు మండలాల గుర్తింపులో ప్రభుత్వం శాస్త్రీయ విధానాన్ని అనుసరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని వాస్తవంగా పంట నష్టపోయిన రైతులను గుర్తించాలని కోరారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

నర్సంపల్లి తరహాలో అన్ని గ్రామాల్లో వ్యవసాయ శాఖ పర్యటనలు చేపట్టాలి

నార్సింగి మండలం నర్సంపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసినట్లు నాయకులు తెలిపారు. ఈ గ్రామంలో 19.5 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా, సుమారు 25 మంది రైతులు బాధితులుగా ఉన్నట్లు వివరించారు. ఇదే తరహాలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని కోరారు.ప్రభుత్వం ఇకనైనా స్పందించి నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి పరిహారం పంపిణీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఈ పర్యటనలో సీఐటీయూ నాయకురాలు బాలమణి తెలంగాణ రక్షణ సేన MBC అధ్యక్షుడు ఇప్ప రమేష్ కరాటే ప్రేమ్ . చిట్టోజిపల్లి గ్రామ సర్పంచ్ మల్లేశం, నర్సంపల్లి మాజీ సర్పంచ్ బాలరాజు గౌడ్, సుతారిపల్లి సర్పంచ్ సునీల్, తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News