పూల పండుగతో పీహెచ్‌సీలో సందడి!

రాజగోపాలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మ వేడుకలు

ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబర్ 15: విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే వైద్య సిబ్బంది ఒక్కచోట చేరారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతికి, గ్రామీణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) లో గురువారం ఘనంగా నిర్వహించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆస్పత్రి ఆవరణలో పూలతో అందంగా బతుకమ్మలను అలంకరించారు. వాటి చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఆడి పాడారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

గ్రామీణ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, గ్రామీణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రకృతిని, పూలను ఆరాధిస్తూ మహిళలు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. ఇలాంటి పండుగలు ప్రజల్లో ఐక్యతను, పరస్పర స్నేహ. భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించే సిబ్బంది విధులతో పాటు సంస్కృతి, సంప్రదాయాలకు కూడా ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సిబ్బంది అందరూ ఐకమత్యంతో పనిచేయాలని కోరారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.

సిబ్బందిలో నూతనోత్సాహం

ప్రతిరోజూ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే సిబ్బందికి బతుకమ్మ వేడుకలు ఆనందాన్ని పంచాయి. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని పక్కనపెట్టి సంప్రదాయ పండుగను కలిసికట్టుగా జరుపుకున్నారు. ఇలాంటి వేడుకలు సిబ్బందిలో ఐక్యతను, పరస్పర సహకార భావనను పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ కుమార్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాస్కర్,శివయ్య, ఆరోగ్య విస్తరణ అధికారి స్వామి, ఏఎన్‌ఎంలు శారద, రేణుక, పద్మ, రజని, మంజుల, స్వర్ణలత, బాలలక్ష్మి, ఆరోగ్య సహాయకులు దుంబాల లింగం గౌడ్, నాగిళ్ల మహేందర్ గౌడ్, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస రెడ్డి, ఫార్మసిస్ట్ కృష్ణ, వివిధ గ్రామాల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News