ప్రజా స్వామ్యానికి పునాది ఓటు హక్కు..!

•కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే…?

•నైతిక బాధ్యత వహిస్తూ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

•కేంద్ర ఎన్నికల సంఘంపై ఎమ్మెల్యే. మేఘారెడ్డి నిప్పులు

వనపర్తి ప్రతినిధి, అక్టోబర్ 03, ప్రతిపక్షం: దేశ ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును పరిరక్షించడంలో ఎన్నికల కమిషన్‌ పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిమాండ్ చేశారు.శనివారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో కలిసి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ప్రజాస్వామ్యానికి జీవనాడి వంటి పౌరుల ఓటు హక్కుపై తెరవెనుక కత్తి వేలాడుతోందా? ప్రజాతీర్పును ముందే నిర్వీర్యం చేసేలా అదృశ్య హస్తాలు కదులుతున్నాయా? వనపర్తి వేదికగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ తీవ్ర సందేహాలకు ఆజ్యం పోస్తున్నాయని అన్నారు.నియోజకవర్గంలో ఏకంగా 35 వేలకుపైగా ఓట్లను గంపగుత్తగా తొలగించడం వెనుక దాగి ఉన్న అసలు మతలబు ఏమిటన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిందన్నారు.కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి, బీజేపీ అనుబంధ విభాగంలా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

భారీగా ఓట్ల గల్లంతు:

నియోజకవర్గంలో ఉన్న 2.75 లక్షల ఓట్లలో దాదాపు 35 వేల ఓట్లను అర్ధాంతరంగా తొలగించారని, పలువురికి అకారణంగా నోటీసులు జారీ చేసి బెంబేలెత్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీలకు మద్దతుగా ఉండే వర్గాల ఓట్లను లెక్కగట్టి మరీ జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు.

సీఈసీ రాజీనామా డిమాండ్:

పారదర్శకతను గాలికొదిలేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మేఘారెడ్డి డిమాండ్ చేశారు.ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం, విశ్వసనీయత అత్యంత ముఖ్యమని ప్రజల ఓటుతో ఏర్పడే ప్రభుత్వాల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అనుమానాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు.అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించడం, ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయడం, ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను కాపాడటం వంటి అంశాలపై ఇండియా కూటమి ప్రజల తరఫున తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఎమ్మెల్యే ప్రకటించారు.ఈ విలేకరుల సమావేశంలో అఖిలపక్ష పార్టీల నాయకులు సిపిఐ పట్టణ సెక్రెటరీ రమేష్, సిపిఎం జిల్లా సెక్రెటరీ పుట్ట ఆంజనేయులు, జబ్బార్, డి కురుమయ్య, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు రహీం, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఖాదర్ బాషా, బాబు గౌడు, గణేష్, మండ్ల రాజు,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, కోళ్ల వెంకటేష్, బి. కృష్ణ, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News