ప్రతిపక్షం, నవంబర్ 10: తెలంగాణ రాష్ట్రంలో జనగణన-2027 రెండో దశ నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా జనాభా వివరాల సేకరణ చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 155ను జారీ చేసింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తెలంగాణ గెజిట్‌లో ప్రభుత్వం పునఃప్రచురించింది. జనగణన ప్రక్రియలో భాగంగా అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుటుంబాలు, జనాభాకు సంబంధించిన వివరాలను సేకరించనున్నారు. ఈసారి ప్రజలకు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు.
స్వీయ జనగణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) ప్రక్రియ జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ 15 రోజుల వ్యవధిలో ప్రజలు ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురానున్న యాప్ లేదా వెబ్సైట్ ద్వారా తమ కుటుంబానికి సంబంధించిన వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల సంఖ్య, ఇతర జనాభా సంబంధిత సమాచారాన్ని ఆన్లైన్లో అందించే వెసులుబాటు కల్పించనున్నారు. జనగణనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు వివరాల సేకరణ ప్రక్రియను సులభతరం చేయడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం. స్వీయ నమోదు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజలు అందించే వివరాలు జనగణన అధికారుల పరిశీలనకు లోబడి ఉంటాయి.
స్వీయ జనగణన గడువు ముగిసిన అనంతరం జనవరి 25 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 28 వరకు జనగణన సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిని సందర్శించి జనాభా వివరాలను సేకరిస్తారు. ఇప్పటికే ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకున్న కుటుంబాల సమాచారాన్ని కూడా క్షేత్రస్థాయి ప్రక్రియలో పరిశీలించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అధికారులకు అవసరమైన సమాచారం అందించి జనగణన సజావుగా పూర్తయ్యేలా సహకరించాల్సి ఉంటుంది. జనాభా లెక్కల సేకరణ అనంతరం వివరాల్లో ఏవైనా మార్పులు, సవరణలు అవసరమైతే వాటిని పరిశీలించేందుకు ప్రత్యేకంగా రివిజనల్ రౌండ్ నిర్వహించనున్నారు.
2027 మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు రివిజనల్ రౌండ్ కొనసాగనుంది. జనగణన-2027కు సంబంధించి మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలను ప్రామాణిక తేదీగా నిర్ణయించారు. అంటే జనాభా వివరాలను లెక్కించేటప్పుడు ఈ తేదీని ప్రాతిపదికగా తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 30న విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 9న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రెండో దశ జనగణన నిర్వహణకు సంబంధించి రాష్ట్ర యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేయనుంది.
జనగణన-2027లో భాగంగా తెలంగాణలో తొలి దశలో ఇళ్ల జాబితా తయారీ, గృహ గణన ప్రక్రియను ఇప్పటికే నిర్వహించారు. ఈ ఏడాది మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగిన ఈ ప్రక్రియలో ఇళ్లు, గృహాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఇప్పుడు రెండో దశలో జనాభా లెక్కల సేకరణకు తేదీలు ఖరారు కావడంతో తదుపరి ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే స్వీయ జనగణనలో ప్రజలు తమ వివరాలను సరిగ్గా నమోదు చేసుకోవడం, అనంతరం ఇంటింటి సర్వేకు వచ్చే సిబ్బందికి సహకరించడం ద్వారా జనగణన ప్రక్రియ విజయవంతం కానుంది.





























