ప్రతిపక్షం, ఆగస్టు 07: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనుంది. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు స్మార్ట్ రేషన్ కార్డుల జారీ, కొత్త పెన్షన్ల మంజూరు వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సందర్భంగా అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందజేయడంతో పాటు రాష్ట్రంలోని సుమారు 1.05 కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. అదే రోజు 2.50 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.
కొత్త పెన్షన్ల మంజూరులో ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
అదే రోజు గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకురానున్నారు. ఆన్‌లైన్ డెలివరీ, క్యాబ్, యాప్ ఆధారిత సేవల్లో పనిచేసే గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ కోసం ఈ చట్టం కీలకంగా మారనుంది. వేతన కోతలు, అన్యాయ ఆంక్షల నుంచి రక్షణ కల్పించడంతో పాటు వారి సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు సేవలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని పేదలు, కార్మికులు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు మరింత భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.





























