[t4b-ticker]

రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి

  • రబీ ధాన్యానికి ఉప్పుడు బియ్యం లక్ష్యం కేటాయించాలి
  • ధాన్యం నిల్వ, మిల్లింగ్ సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలి

ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర, సెప్టెంబర్ 11: రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం నిర్ణయం మేరకు బియ్యం మిల్లులను బంద్ చేస్తున్నట్లు కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్లు తెలిపారు. రబీ 2025-26 ధాన్యానికి ఉప్పుడు బియ్యం లక్ష్యం కేటాయించడంతో పాటు ఖరీఫ్, రబీ ధాన్యం మిల్లింగ్‌కు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్సులు సుధాకర్, శశిధర్ లు మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం సేకరణ, మిల్లింగ్, ప్రభుత్వానికి బియ్యం సరఫరా తదితర కార్యక్రమాల్లో రైస్ మిల్లర్లు నిరంతరం సహకరిస్తున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం అధిక నూకలు, బియ్యం నష్టం, ధాన్యం కొరత, భారత ఆహార సంస్థ గోదాముల్లో స్థలాభావం, ఉప్పుడు బియ్యం నిల్వ వంటి సమస్యలతో మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

  • రబీ ధాన్యానికి ఉప్పుడు బియ్యం లక్ష్యం కేటాయించాలి

రబీ 2025-26లో వచ్చిన ధాన్యంలో అధిక భాగం ఉప్పుడు బియ్యం తయారీకి అనుకూలంగా ఉందని మిల్లర్లు తెలిపారు. అదే ధాన్యాన్ని సాధారణ బియ్యంగా మిల్లింగ్ చేస్తే తెల్లటి మచ్చలు, నూకలు అధికంగా వస్తున్నాయని చెప్పారు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత, బియ్యం దిగుబడిని సాధించడం ఆచరణలో సాధ్యం కావడం లేదన్నారు. అందువల్ల రబీ ధాన్యానికి తగిన ఉప్పుడు బియ్యం లక్ష్యాన్ని కేటాయించి, వాస్తవ బియ్యం దిగుబడికి అనుగుణంగా నిష్పత్తిని నిర్ణయించాలని కోరారు.

నూకలు, తేమ నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
అధిక నూకలు, తేమ వల్ల కలిగే నష్టం, సహజంగా ధాన్యం నాణ్యత తగ్గడం, వడపోత ప్రక్రియలో జరిగే నష్టాలను పరిగణనలోకి తీసుకోవాలని మిల్లర్లు కోరారు. శాస్త్రీయ పరీక్షలు, మైసూరు కేంద్రంలోని పరీక్షా మిల్లింగ్, వాస్తవ మిల్లింగ్ దిగుబడి ఆధారంగా బియ్యం నిష్పత్తిని నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం ఉన్న ధాన్యం నిల్వలు, ప్రభుత్వానికి అప్పగించిన బియ్యం, లెక్కలను పూర్తిగా పరిష్కరించిన అనంతరం వాస్తవ పరిస్థితుల ఆధారంగా భౌతిక తనిఖీలు నిర్వహించాలని కోరారు. 67 శాతం బియ్యం నిష్పత్తి సాధించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మిల్లర్లను మానవతా దృక్పథంతో పరిశీలించి ఒకేసారి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

పాత ధాన్యం పరిష్కారం తర్వాతే కొత్త ధాన్యం
ప్రస్తుతం సుమారు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల రబీ ధాన్యం, మరో లక్ష మెట్రిక్ టన్నుల ఖరీఫ్ ధాన్యం పెండింగ్‌లో ఉందని మిల్లర్లు తెలిపారు. పాత ధాన్యానికి సంబంధించిన లెక్కలు, మిల్లింగ్, ప్రభుత్వానికి బియ్యం అప్పగింత పూర్తిగా పరిష్కరించిన తర్వాతే కొత్త ఖరీఫ్ ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా ప్రణాళిక రూపొందించాలని కోరారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి భారత ఆహార సంస్థ గోదాముల్లో నిల్వ చేయాలని విజ్ఞప్తి చేశారు.

గోదాముల్లో నిల్వ స్థలం కల్పించాలి
భారత ఆహార సంస్థ గోదాముల్లో తగినంత నిల్వ స్థలం కల్పించి, సిద్ధంగా ఉన్న ఉప్పుడు బియ్యాన్ని, ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని సకాలంలో తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గోదాముల్లో స్థలాభావం కారణంగా మిల్లుల్లో బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయని తెలిపారు.

వర్షాలతో దెబ్బతిన్న ధాన్యానికి అదనపు గడువు ఇవ్వాలి
వర్షాల కారణంగా ధాన్యం దెబ్బతిన్న నేపథ్యంలో మిల్లింగ్, ప్రభుత్వానికి బియ్యం అప్పగించేందుకు అదనపు సమయం అవసరమని మిల్లర్లు తెలిపారు. అందువల్ల నవంబర్ వరకు, అవసరమైతే డిసెంబర్ వరకు అదనపు గడువు ఇవ్వాలని కోరారు. అదనపు గడువు ఇచ్చిన పక్షంలో తమ వద్ద ఉన్న ధాన్యానికి ప్రతి గింజకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం, బియ్యాన్ని పూర్తిగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

  • మిల్లింగ్ రుసుములు సకాలంలో చెల్లించాలి

మిల్లర్లకు రావాల్సిన మిల్లింగ్ రుసుములు, రవాణా రుసుములు, సంరక్షణ రుసుములను సకాలంలో చెల్లించాలని కోరారు. అలాగే 25 శాతం జరిమానా, అదనపు రవాణా రుసుములను మాఫీ చేసి బియ్యం మిల్లుల పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.జిల్లా అధికారులతో పాటు రైస్ మిల్లర్ల ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితులపై చర్చించి ఆచరణాత్మక పరిష్కారం చూపాలని కోరారు. రైతుల ప్రయోజనాలు, ప్రభుత్వ ధాన్యం సేకరణ, బియ్యం సరఫరా వ్యవస్థకు రైస్ మిల్లర్లు ఎల్లప్పుడూ సహకరిస్తారని తెలిపారు. తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Spread the love

Related News

Latest News