[t4b-ticker]

ప్రజయ్ వాటర్ ఫ్రంట్‌లో భారీగా చెట్ల నరికివేత

బీఆర్ఎస్ కౌన్సిలర్‌పై కాలనీవాసుల ఆరోపణలు

సంబంధిత అధికారులకు ఫిర్యాదు

ప్రతిపక్షం,శామీర్‌పేట, సెప్టెంబర్ 11: పచ్చదనానికి ప్రతీకగా ఉన్న ప్రజయ్ వాటర్ ఫ్రంట్ కాలనీలో భారీగా చెట్ల నరికివేత జరుగుతోందంటూ కాలనీవాసులు, సంక్షేమ సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అలియాబాద్ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్, బీఆర్‌ఎస్ నాయకుడు మహమ్మద్ యూసఫ్ బాబా ఆధ్వర్యంలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సుమారు 100 నుంచి 150 వరకు భారీ వృక్షాలను తొలగిస్తున్నారని ఆరోపించారు…

శామీర్‌పేట మండలం తుర్కపల్లిలోని ప్రజయ్ వాటర్ ఫ్రంట్ కాలనీలో రాత్రికి రాత్రే ఫేస్ 1లో 30కి పైగా చెట్లను నరికివేశారని కాలనీవాసులు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం పేరుతో చెట్లను విచక్షణారహితంగా తొలగిస్తున్నారని తెలిపారు…

నగర జీవనంలోని కాలుష్యం, రద్దీకి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలనే ఉద్దేశంతో పచ్చని చెట్లతో కూడిన ప్రజయ్ వాటర్ ఫ్రంట్‌ను ఎంచుకుని గత 15 ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నామని కాలనీవాసులు పేర్కొన్నారు. తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా చెట్లను తొలగించడం ఆందోళన కలిగిస్తోందన్నారు…

కాలనీ సంక్షేమ సంఘానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చెట్ల నరికివేతకు చర్యలు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చెట్లను తొలగించడంపై కౌన్సిలర్‌ నుంచి ఒక్కొక్కరికి ఒక్కో కారణం చెబుతున్నారని ఆరోపించారు. కొందరికి కోతుల బెడద కారణంగా కొమ్మలు తొలగిస్తున్నామని, మరికొందరికి డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం చెట్లను తొలగిస్తున్నామని చెబుతున్నట్లు కాలనీవాసులు తెలిపారు…

చెట్ల నరికివేత వెనుక కలప విక్రయ ఉద్దేశం ఉందనే అనుమానాలను కూడా కొందరు కాలనీవాసులు వ్యక్తం చేశారు…

భారీ వృక్షాలను విచక్షణారహితంగా నరికివేయడాన్ని వెంటనే నిలిపివేసి, చెట్ల తొలగింపునకు అనుమతులు ఉన్నాయా? నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారా? అనే అంశాలపై అధికారులు విచారణ జరిపించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు…

చెట్ల నరికివేతపై జిల్లా అటవీశాఖ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులకు కాలనీవాసులు, సంక్షేమ సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుని, అక్రమంగా చెట్లను తొలగించినట్లయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Spread the love

Related News

Latest News