ఐదు ఎకరాలు ఏమయ్యాయి?
వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి అన్యాక్రాంతంపై సమగ్ర విచారణ జరిపించాలి
ఎంపీ రఘునందన్‌రావుకు జిల్లా శ్రీనివాస్, ఉడుత మల్లేశం వినతి
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట నవంబరు 3: దేవుడి సొమ్ముకు దొంగలెవరు? భక్తుల విరాళాలతో నిర్మించిన ఆలయానికి కేటాయించిన ఐదు ఎకరాల భూమి చివరకు ఎలా చేతులు మారింది? ఐదు ఎకరాలుగా ఉన్న ఆలయ భూమి ఒక ఎకరానికి ఎలా పరిమితమైంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని శ్రీనివాస సేవా సమితి అధ్యక్షుడు జిల్లా శ్రీనివాస్, దేవాలయాల పరిరక్షణ సమితి నాయకుడు ఉడుత మల్లేశం పేర్కొన్నారు.సిద్ధిపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి కేటాయించిన భూమి అన్యాక్రాంతమైనట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి, ఆలయ ఆస్తులను తిరిగి పరిరక్షించాలని కోరుతూ మంగళవారం మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన రావును కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఐదు ఎకరాల నుంచి ఒక్క ఎకరానికేనా?
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో సిద్ధిపేటలోని బ్లాక్ ఆఫీస్ సమీపంలో వెంకటేశ్వర స్వామి ఆలయం పేరుతో ఐదు ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. అప్పటి ఎమ్మెల్యే మదన్మోహన్ సూచనల మేరకు అప్పటి ఆర్డీవో వెంకట నరసయ్య ఐదు ఎకరాల అసైన్డ్ భూమిని ఆలయానికి కేటాయించారని వివరించారు. సిద్ధిపేట ప్రజలు, భక్తులు, దాతల సహకారంతోనే ఆలయ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. అయితే ఆలయానికి కేటాయించిన ఐదు ఎకరాల భూమి కేవలం ఏడాది పాటు మాత్రమే ఆలయ పేరుపై ఉండి, ఆ తర్వాత సంబంధిత వ్యక్తి కుమారుల పేర్లకు మారినట్లు వారు ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఆలయ పేరుపై కేవలం ఒక ఎకరం మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసంతో ముడిపడిన దేవాలయ భూమి విషయంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం ఆందోళనకరమన్నారు.
భూమి చేతులు మారిన తీరుపై విచారణ ఏదీ?
అసలు అసైన్డ్ భూమి ఆలయ పేరు మీదకు ఎలా వచ్చింది? ఆ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు ఎలా జారీ అయ్యాయి? ఏడాది తర్వాత ఆలయ భూమి ఇతరుల పేర్లకు ఎలా మారింది? ఐదు ఎకరాల్లో నాలుగు ఎకరాలు ఏ పరిస్థితుల్లో ఆలయ అధీనంలో లేకుండా పోయాయి? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాలని వారు డిమాండ్ చేశారు.ఈ వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి, సంబంధిత రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో సమగ్ర విచారణ చేయించాలని కోరారు. ఆలయ భూమి అన్యాక్రాంతమైనట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, ఆలయానికి చెందిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
రాజకీయాలకు అతీతంగా ఆలయ ఆస్తుల పరిరక్షణకు ఉద్యమించాలి
దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా ప్రజల విశ్వాసానికి ప్రతీకలని, వాటి ఆస్తులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని వారు పేర్కొన్నారు. దేవాలయాల భూములు, ఆస్తులు అన్యాక్రాంతమవుతున్న అంశాలపై ప్రశ్నించకుండా మౌనం వహించడం సరికాదన్నారు. సిద్ధిపేటకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు, ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఒక్కటై వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆలయానికి చెందిన భూములు, ఆస్తులను కాపాడేందుకు తమ పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ఆస్తుల పరిరక్షణ సమితి నాయకులు సత్యం, వేణు తదితరులు పాల్గొన్నారు.





























