ప్రతిపక్షం, అక్టోబర్ 08: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పరిధిలోని అన్ని గురుకులాల్లో విద్యార్థుల హాజరు నమోదుకు కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఇకపై విద్యార్థుల హాజరును ముఖ గుర్తింపు సాంకేతికత ఆధారంగా నమోదు చేయనున్నారు. ఇందుకు అవసరమైన పరికరాలను ఎల్లుండిలోగా అన్ని గురుకులాల్లో ఏర్పాటు చేయాలని సంస్థ కార్యదర్శి రవి అధికారులను ఆదేశించారు.
గురుకులాల్లో విద్యార్థుల హాజరు ప్రక్రియను మరింత పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించడంతో పాటు విద్యార్థుల హాజరుపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా ముఖ గుర్తింపు విధానాన్ని తీసుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పరికరాల ఏర్పాటు, సాంకేతిక వ్యవస్థ పనితీరు, రోజువారీ హాజరు నమోదును పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అంతేకాకుండా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని సంస్థ కార్యదర్శి స్పష్టం చేశారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉండేలా గ్రంథాలయాలను బలోపేతం చేయాలని సూచించారు. విద్యార్థుల్లో ప్రయోగాత్మక అభ్యాసాన్ని పెంచేందుకు ప్రయోగశాలలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందేలా అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఆహార నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని, విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా గురుకుల విద్యాసంస్థల్లో దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థుల హాజరు నమోదుకు ముఖ గుర్తింపు విధానం అందుబాటులోకి రానుండటంతో ఈ విధానం ప్రాధాన్యత సంతరించుకుంది. పరికరాల ఏర్పాటు పూర్తయిన అనంతరం అన్ని గురుకులాల్లో కొత్త హాజరు విధానం అమల్లోకి రానుంది.





























