ప్రతిపక్షం, ఆగస్టు 05: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం గురువారం జరగనున్న “సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ”కు సిద్ధమవుతోంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభ కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సబ్బండ వర్గాల సాధికారత లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సభా ప్రాంగణాన్ని సామాజిక చైతన్యానికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, భాగ్యరెడ్డి వర్మ వంటి మహనీయుల చిత్రపటాలను ఏర్పాటు చేస్తున్నారు. సమానత్వం, విద్య, సామాజిక మార్పు కోసం పోరాడిన వారి సేవలను ఈ సందర్భంగా స్మరించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
అలాగే చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, కాన్షీరాం, కొమురం భీమ్, కొండా లక్ష్మణ్ బాపూజీ, కర్పూరి ఠాకూర్ వంటి సామాజిక, రాజకీయ ఉద్యమకారుల చిత్రాలను కూడా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ చరిత్రలో కీలక పాత్ర పోషించిన వీరుల సేవలను కొత్త తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
అదేవిధంగా టీఎన్ సదాలక్ష్మి, పండుగ సాయన్న, వడ్డెర ఓబన్న, సంత్ సేవాలాల్ మహారాజ్, సంగం లక్ష్మీబాయి, షోయబుల్లా ఖాన్, మారోజు వీరన్న, మఖ్దూం మొహియుద్దీన్ వంటి ప్రముఖుల చిత్రాలతో సభా ప్రాంగణాన్ని అలంకరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం, సామాజిక న్యాయం, బహుజన సాధికారత కోసం కృషి చేసిన మహనీయుల స్ఫూర్తిని ప్రజలకు చేరవేయడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సభ ద్వారా భౌగోళిక తెలంగాణ సాధన తర్వాత సామాజిక న్యాయ తెలంగాణ నిర్మాణంపై చర్చ ప్రారంభించాలని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త రాజకీయ ఆలోచనలకు వేదిక కల్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సబ్బండ వర్గాల అభ్యున్నతి, సమాన భాగస్వామ్యం, సామాజిక సాధికారత ప్రధాన అజెండాగా ఈ సంకల్ప సభ కొనసాగనుంది.

















