[t4b-ticker]

పదేళ్ల పింక్‌ పాలన కంటే.. వెయ్యిరోజుల ప్రజాపాలన భేష్‌

ప్రతిపక్షం, సెప్టెంబర్ 01, కేసముద్రం: పదేళ్ల పింక్‌ పార్టీ పాలనతో పోలిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తున్న వెయ్యిరోజుల ప్రజాపాలన ఎంతో మెరుగ్గా ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ఏ ఇంటికి వెళ్లినా, ఏ ఆడబిడ్డను, ఏ రైతును అడిగినా ప్రజాపాలనపై సానుకూల అభిప్రాయమే వ్యక్తం చేస్తారని పేర్కొన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.

వెయ్యిరోజుల కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పొంగులేటి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగిస్తోందన్నారు. రైతులు, మహిళలు, పేదలు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

వెయ్యిరోజుల ప్రభుత్వం ఏం చేసిందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేయడాన్ని మంత్రి తప్పుబట్టారు. ‘‘వెయ్యిరోజుల ప్రభుత్వం ఏం చేసిందంటూ రేపో మాపో పింక్‌ పార్టీ వాళ్లు ఏదో కార్యక్రమం చేపడుతున్నారట. వారికి కళ్లుండి కనిపించడం లేదా? చెవులుండి వినిపించడం లేదా?’’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన ఇప్పటికే ప్రజాభిమానాన్ని పొందిందని మంత్రి పేర్కొన్నారు. గత పాలనతో పోలిస్తే ప్రస్తుతం ప్రజలకు సంక్షేమ ఫలాలు మరింత చేరువయ్యాయని అన్నారు. ప్రభుత్వ పనితీరును ప్రజలే నిర్ణయిస్తారని, ప్రజల మధ్యకు వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని బీఆర్‌ఎస్‌ నేతలకు సూచించారు.

వెయ్యిరోజుల ప్రజాపాలన సందర్భంగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News