ప్రతిపక్షం, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమర వీరులకు ఘన నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికులను స్మరించుకున్నారు.
స్వాతంత్య్రం కోసం, దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరుల త్యాగాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. దేశ సార్వభౌమత్వం, భద్రత, సమైక్యత కోసం సైనికులు చేస్తున్న సేవలను కొనియాడారు.
ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీర సైనికుల స్మారకం వద్ద నివాళులు అర్పించడం ద్వారా వారి త్యాగాలను స్మరించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు.

































