ఆశయమే ముఖ్యం.. పదవులు కాదు

తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ

బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, సెప్టెంబర్ 27: తెలంగాణ కోసం తన పదవిని త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం కావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ పదవుల కంటే ప్రజలు, అధికారం కంటే ఆశయం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని నమ్మి జీవితాంతం ప్రజల కోసం పని చేసిన మహనీయుడు బాపూజీ అని కొనియాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన బాపూజీ, అనంతరం తెలంగాణ ప్రజల హక్కుల కోసం కూడా అదే స్ఫూర్తితో పోరాటం చేశారని పేర్కొన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమం -1969 సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలోనూ వయస్సును లెక్కచేయకుండా బాపూజీ తన గొంతును బలంగా వినిపించారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న ఆకాంక్షతో చివరి వరకు నిలబడ్డారని గుర్తుచేశారు.

ఉద్యమానికి ఇంటినే అంకితం చేశారు

మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయంలో బాపూజీ తన ఇంటిని టీఆర్‌ఎస్ పార్టీ కార్యకలాపాల కోసం ఇచ్చి ఉద్యమానికి ఆశీర్వాదం, చేయూత అందించారని హరీశ్‌ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం దొడ్డి కొమురయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న వంటి మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించే సంప్రదాయానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని హరీశ్‌ రావు పేర్కొన్నారు.

బాపూజీ ఆశయాలను కొనసాగించాలి

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను భావితరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని హరీశ్‌ రావు అన్నారు. ఆయన ఆశయాలు, ప్రజా సేవా స్ఫూర్తి నిరంతరం కొనసాగేందుకు ప్రభుత్వాలు బాపూజీ పేరిట మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని హరీశ్‌ రావు పిలుపునిచ్చారు.

Spread the love

Related News

Latest News