రైతు బీమా నిలిపివేత.. వేల కుటుంబాలకు అన్యాయం

బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలి

రైతు బీమాను పునరుద్ధరించాలి

లేకుంటే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తాం

తన్నీరు హరీశ్‌ రావు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, సిద్ధిపేట ఎమ్మెల్యే.

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 15: రైతు కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో విఫలమైందని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష ఉప నాయకుడు హరీశ్‌ రావు విమర్శించారు. రైతు బీమా పథకం నిలిచిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు
ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. మరణించిన రైతుల కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు బీమా పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే బాధిత కుటుంబాలతో కలిసి ముఖ్యమంత్రి నివాసాన్ని, సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

సిద్ధిపేటలోని ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో గురువారం రైతు బీమా అందని 22 మంది రైతుల కుటుంబాలతో హరీశ్‌ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బీమా సొమ్ము అందక ఎదుర్కొంటున్న ఇబ్బందులను బాధితులు ఆయనకు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

రైతు కుటుంబాలకు భరోసా ఏది?

బాధిత కుటుంబాల ఆవేదన తనను కలచివేసిందని హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వానికి పరిస్థితిని వివరించి, రైతు కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి నుంచి అక్టోబరు 15 వరకు సిద్దిపేట నియోజకవర్గంలో 22 మంది రైతులు మరణించారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది రైతులు చనిపోయారని చెప్పారు. వారి కుటుంబాలకు బీమా సొమ్ము అందలేదని ఆరోపించారు. రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించిందని విమర్శించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారు అప్పుల భారంతో సతమతమవుతున్నారని అన్నారు. వైద్య ఖర్చుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు మరింత కష్టాల్లో కూరుకు పోయాయని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్‌ హయాంలో రైతు బీమా అమలు

రైతు కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ప్రభుత్వం 2018లో రైతు బీమా పథకాన్ని ప్రారంభించిందని హరీశ్‌ రావు గుర్తు చేశారు. రైతు మరణించినప్పుడు కారణంతో సంబంధం లేకుండా కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించేలా ఈ పథకాన్ని రూపొందించారని తెలిపారు. నాటి ప్రభుత్వం ఏటా సుమారు రూ.1,400 కోట్ల బీమా ప్రీమియాన్ని చెల్లించేదని పేర్కొన్నారు. 2018 నుంచి 2024 వరకు వివిధ కారణాలతో మరణించిన 1,38,688 మంది రైతు కుటుంబాలకు సుమారు రూ.ఏడు వేల కోట్ల బీమా సాయం అందించినట్లు వివరించారు.రైతు బీమా పథకాన్ని నిలిపివేయడం వల్ల పేద రైతు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వాపోయారు. బీమా ప్రీమియాన్ని వెంటనే చెల్లించి పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన బాధిత కుటుంబాలన్నింటికీ రూ.5 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

కొత్త పథకంపై స్పష్టత ఇవ్వాలి

రైతు బీమాకు బదులుగా కొత్త పథకాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, దాని అమలుపై స్పష్టత లేదని హరీశ్‌ రావు విమర్శించారు. గతంలో అమలైన పథకాలను కొనసాగిస్తామని చెప్పి వాటిని నిలిపివేస్తున్నారని ఆరోపించారు. రైతు బీమాతోపాటు కేసీఆర్‌ కిట్‌, పోషకాహార కిట్‌, గొర్రెల పంపిణీ, విద్యార్థుల ఫీజుల తిరిగి చెల్లింపు
(రీయింబర్స్మెంట్) వంటి పథకాల అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రైతు కుటుంబాలకు భరోసా కల్పించే పథకాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలని కోరారు.

సాగునీటి సరఫరాలో విఫలం.. విద్యుత్‌ సరఫరాలో ఘోర వైఫల్యం

రైతులకు సాగు నీరు అందివ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విద్యుత్‌ సరఫరాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గతంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా అందించామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎనిమిది గంటలు కూడా సరిగా అందడం లేదని విమర్శించారు. నీటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ పొలాలకు నీరు అందించడంలో నిర్లక్ష్యం జరుగుతోందని అన్నారు.విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలకు అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవడాన్ని తప్పుబట్టారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విద్యుత్‌ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సమస్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే విద్యుత్‌, సాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు.

బాధితులకు అండగా ఉంటాం

రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించి, మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని హరీశ్‌రావు ప్రకటించారు. అవసరమైతే రైతు కుటుంబాలతో కలిసి ముఖ్యమంత్రి నివాసాన్ని, సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబాలు ఆందోళన చెందవద్దని, భారత రాష్ట్ర సమితి వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శాసనసభలోనూ ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. రైతు కుటుంబాలకు బీమా సొమ్ము అందేలా పోరాడతామని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News