*సర్పంచులను పిండేస్తున్న వసూళ్ల భాగోతం – బిల్లు కావాలంటే చేతులు తడపాల్సిందేనా..?
*చేతులు తడపకపోతే బిల్లులు ముందుకు కదలవా..?టెక్నికల్ సమస్యలు అంటూ తిప్పలు.
*లంచాలకు అడ్డాగా మారిన ఎంపీడీవో కార్యాలయం !
*ఇంతేనా నాకు ఇచ్చేది..? – డబ్బు వెనక్కిచ్చిన ఉద్యోగి !
*బిల్లుల కోసం సర్పంచుల అవస్థలు – ఉన్నతాధికారులకు ఫిర్యాదుకు సిద్ధం.
ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 16 : చండూరు ఎంపీడీవో కార్యాలయం లంచాలకు పరాకాష్ఠగా మారిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు సక్రమంగా రాక సర్పంచులు ఇప్పటికే సమస్యలతో కూనరిల్లుతున్నారు. ఇలాంటి సమయంలో 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు కొంత ఊపిరి పోశాయి. కానీ ఆ నిధులు కూడా సర్పంచుల చేతికి సకాలంలో అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
*బిల్లు కోసం ఆఫీసు చుట్టూ తిరగాల్సిందే.
సర్పంచులు గ్రామ పంచాయతీల్లో పనులు చేయించిన తర్వాత ఎంబీ చేయించి ఎంపీడీవో కార్యాలయానికి వస్తారు. ఆ తర్వాత కార్యాలయంలో ఉండే ఉద్యోగులు వాటిని సిస్టమ్ లో అప్ లోడ్ చేసి చెక్కులు పాస్ చేయడానికి కావాల్సిన పనిని పూర్తి చేస్తారు. ఇక్కడే అసలు కథ మొదలవుతోందని సర్పంచులు ఆరోపిస్తున్నారు.ఏ సర్పంచ్ అయినా సరే బిల్లులు రావాలంటే ఎంపీడీవో కార్యాలయంలో ఓ ఉద్యోగి చేతులు తడపాల్సిందేనా..? అని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. డబ్బు ఇవ్వకపోతే బిల్లులు ముందుకు కదలవని, రోజుల తరబడి ఆఫీసు చుట్టూ తిప్పుకుంటారని వారు వాపోతున్నారు.
*ఇంతేనా ఇచ్చేది అంటూ డబ్బు వెనక్కి..!
ఇటీవల ఓ గ్రామ సర్పంచ్ తన బిల్లులు పాస్ చేసినందుకు ఎంతో కొంత తనకు తోచినంత ఎమౌంట్ ను సదరు ఉద్యోగికి సమర్పించగా… “ఇంతేనా నాకు ఇచ్చేది” అంటూ ఆ ఎమౌంట్ ను వెనక్కి ఇచ్చి ఆ సర్పంచ్ కి బిల్లులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.తన పని కోసం తాను డబ్బు ఇచ్చినా అవమానించడమే కాకుండా బిల్లులు ఆపేశారని సదరు సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఆ సర్పంచ్ సిద్ధం అయ్యారు.
*ఒక్కడే కాదు.. మరికొందరు కూడా..?
ఈయనతో పాటు మరికొంత మంది సర్పంచులు సైతం ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ వసూళ్ల భాగోతంలో ఒక్క ఉద్యోగి మాత్రమే ఉండరని, ఇందులో కార్యాలయంలో ఉండే ఇతర ఉద్యోగులు కూడా భాగస్వాములుగా ఉంటారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులు రాకపోతే వారు కాంట్రాక్టర్లకు, కూలీలకు డబ్బులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో గ్రామాల్లో పనులు కూడా నిలిచిపోతున్నాయి.
*ఎంపీడీవో వివరణ ఏంటంటే.
ఈ విషయమై ఎంపీడీవో యాదగిరిని వివరణ కోరగా, టెక్నికల్ సమస్యలు ఉన్నవారికి బిల్లులు రావడంలో కొంత ఆలస్యం అవుతుందని, కానీ తన కార్యాలయంలో బిల్లులు చెల్లించాలంటే డబ్బులు అడుగుతున్నారనే ఫిర్యాదులు తన దృష్టికి రాలేదని, ఇకపై ఈ విషయంపై దృష్టి సారిస్తానని తెలిపారు.అయితే సర్పంచులు మాత్రం టెక్నికల్ సమస్య పేరుతో తమను వేధిస్తున్నారని, డబ్బు ఇస్తేనే టెక్నికల్ సమస్యలు తీరిపోతాయా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయమై ఉన్నతాధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి, చండూరు ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న వసూళ్లపై విచారణ జరిపించాలని, సర్పంచులకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు, సర్పంచులు కోరుతున్నారు.





























