బియ్యం ధరలకు ‘రెక్కలు’.. సామాన్యుడికి చుక్కలు!

*క్వింటాల్ రూ.4,500 నుంచి రూ.12 వేలకు జంప్… ఏ రకం బియ్యం కొన్నా ధరల మోతే!

*కిలో సన్న బియ్యం రూ.90 – సామాన్యుడి బడ్జెట్ తలకిందులు.

*ప్రభుత్వ ధాన్యం నిల్వలపై స్పష్టత కరవు – అక్రమ నిల్వల అనుమానం.

*నియంత్రణ చర్యలు తీసుకోవాలి – పొట్ట నింపే బియ్యమే భారమైతే ఎలా?

*సన్న బియ్యం సెగ.. సామాన్యునికి అందని ద్రాక్ష..!

ప్రతిపక్షం మునుగోడు అక్టోబర్ 25 : ఎల్ ని నో ప్రభావంతో రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యులు సతమతమవుతుంటే.. తాజాగా బియ్యం ధరలు చుక్కలనంటుతున్నాయి. దసరాకు ముందు క్వింటాల్‌ బియ్యం రూ.4,500 నుంచి రూ.6,500 మధ్య లభించగా.. ప్రస్తుతం నాణ్యత, రకాలను బట్టి క్వింటాలు ధర రూ. 9 వేల నుంచి రూ.12 వేల వరకు ధర పలుకుతోంది. ముఖ్యంగా సన్న బియ్యం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. కిలో సన్న బియ్యం ధర రూ.90 వరకు ఉండటంతో సమాన్యుడి నెలవారీ ఇంటి బడ్జెట్‌ తలకిందులవుతోంది. నిత్యం అన్నం తినే పేద, మధ్యతరగతి కుటుంబాలకు బియ్యం కొనుగోలు భారంగా మారిపోయింది. మార్కెట్లో 25 కిలోల సన్న బియ్యం బస్తా ధర నాణ్యతను బట్టి రూ.1,700 నుంచి రూ.2,100కు పైగా పలుకుతోంది. గతంలో తక్కువ ధరకు లభించిన బియ్యం ప్రస్తుతం అధిక ధరలకు చేరడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబ అవసరాల కోసం నెలకు ఒకటి, రెండు బస్తాలు కొనుగోలు చేసే వారు అదనంగా వందల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇప్పటికే కూరగాయలు, పప్పులు, వంటనూనెల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బియ్యం ధరల పెరుగుదల మరింత భారంగా పరిణమించింది.

*ఏ రకం బియ్యం కొన్నా ధరల మోతే!

సోనా మసూరి, బీపీటీ, సన్న బియ్యం వంటి రకాల ధరలు పెరగడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. నాణ్యతను బట్టి కిలో ధర రూ.60 నుంచి రూ.90 వరకు ఉండగా, కొన్ని సూపర్‌ఫైన్‌ రకాల ధరలు అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు మార్కెట్లో ప్రచారం జరుగుతోంది. ధరలు పెరగడానికి కారణాలపై స్పష్టత లేకపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం కొనుగోలు చేసే ముందు ధరలను పోల్చి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

*ప్రభుత్వ ధాన్యం నిల్వలపై స్పష్టత కరవు:

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం నిల్వలు ఎన్ని ఉన్నాయి? వాటి నుంచి ఎంత మేర బియ్యం ఉత్పత్తి అవుతోంది? మార్కెట్‌కు ఎంత సరఫరా చేస్తున్నారు? విక్రయాలు ఏ ధరలకు జరుగుతున్నాయి? వంటి అంశాలపై సమగ్ర పరిశీలన జరగాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధరల పెరుగుదల వెనుక అక్రమ నిల్వలు లేదా కృత్రిమ కొరత సృష్టించే చర్యలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఈ విషయంలో నిష్పక్షపాతంగా తనిఖీలు జరిపి వాస్తవాలను వెల్లడించాలని పేద, మధ్య తరగతి ప్రజలు కోరుతున్నారు. అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.

*నియంత్రణ చర్యలు తీసుకోవాలి:

బియ్యం ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత ఒత్తిడికి గురవుతోంది. మార్కెట్లో ధరల పరిస్థితిని అధికారులు పర్యవేక్షించాలని, వ్యాపారులు నిర్ణయించిన ధరలకు అనుగుణంగా విక్రయిస్తున్నారా లేదా పరిశీలించాలని వినియోగదారులు కోరుతున్నారు. బియ్యం ధరల పెరుగుదలకు గల కారణాలను ప్రభుత్వం సమీక్షించి, ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పొట్ట నింపే బియ్యమే భారమైతే.. సామాన్యుడి కుటుంబ బడ్జెట్‌ ఎలా గట్టెక్కుతుంది? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తోంది.”

Spread the love

Related News

Latest News