కోతుల దాడితో బాలుడి మృతి.. వల్లాపురంలో విషాదం

ప్రతిపక్షం, అక్టోబర్ 24: తెలంగాణలో కోతుల బెడద మరో విషాద ఘటనకు కారణమైంది. సూర్యాపేట జిల్లాలోని వల్లాపురం గ్రామంలో కోతుల దాడితో భయాందోళనకు గురైన 12 ఏళ్ల బాలుడు నిశాంక్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానికుల కథనం ప్రకారం, నిశాంక్ తన అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో కోతులు అతడిపై దాడి చేశాయి. ఒక్కసారిగా కోతులు మీదకు రావడంతో బాలుడు తీవ్రంగా భయపడి కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతడి గుండె ఆగిపోయినట్లు సమాచారం. వెంటనే బాలుడిని ఆదుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. అనంతరం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో గుండెపోటు కారణంగా బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించినట్లు సమాచారం.

కోతుల దాడి కారణంగా బాలుడు తీవ్ర భయానికి గురవడం, ఆ తర్వాత ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కోతుల సంచారం పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల పరిసరాలు, రహదారులు, వ్యవసాయ క్షేత్రాల్లోకి వస్తున్న కోతులు పలువురిపై దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కోతుల బెడదను నియంత్రించేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. చిన్నారి మృతితో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Spread the love

Related News

Latest News