మళ్లీ ఎన్డీఏలోకి అకాలీదళ్.. బీజేపీతో ఎన్నికల పొత్తు ఖరారు!

ప్రతిపక్షం, నవంబర్ 24: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ, శిరోమణి అకాలీదళ్ మరోసారి చేతులు కలిపాయి. ఆరేళ్ల విరామం తర్వాత అకాలీదళ్ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరింది. ఈ మేరకు అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. దీంతో పంజాబ్‌లో రాజకీయ సమీకరణాలు మరోసారి మారే అవకాశం కనిపిస్తోంది.

అకాలీదళ్ తిరిగి ఎన్డీఏలో చేరడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు నుంచి శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతుందని, రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు. అకాలీదళ్ ఎన్డీఏకు చిరకాల మిత్రపక్షమని, ఆ పార్టీ తిరిగి కూటమిలోకి రావడం భాగస్వామ్య పార్టీలన్నింటికీ సంతోషాన్ని కలిగించే విషయమని పేర్కొన్నారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తిరిగి రావడంతో ఎన్డీఏ మరింత బలోపేతమైందని వ్యాఖ్యానించారు. బీజేపీ, అకాలీదళ్ మధ్య ఉన్న అనుబంధం హిందూ, సిక్కు సమాజాల మధ్య సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. గతంలో రెండు పార్టీలు అనేక ఎన్నికల్లో కలిసి పోటీ చేసి విజయాలు సాధించాయని గుర్తుచేశారు.

కాగా, శిరోమణి అకాలీదళ్ 2020లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 2020 సెప్టెంబర్ 26న కూటమికి రాజీనామా చేసింది. ఆ సమయంలో రైతుల ఆందోళన పంజాబ్ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అకాలీదళ్ తీసుకున్న నిర్ణయం బీజేపీతో దశాబ్దాలుగా కొనసాగిన రాజకీయ బంధానికి విరామం పలికింది. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య దూరం కొనసాగుతూ వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో ఇరు పార్టీల నేతల మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు అకాలీదళ్ మద్దతు ప్రకటించింది. ఇటీవల చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో పొత్తు చర్చలకు సిద్ధమని అకాలీదళ్ ప్రకటించడం కూడా రెండు పార్టీల మధ్య సాన్నిహిత్యం పెరగడానికి దోహదపడింది.

ఇక పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉండగా, సీట్ల పంపకాలు ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. అందులో 40 నుంచి 48 స్థానాలను తమకు కేటాయించాలని బీజేపీ కోరుతున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా జాట్ సిక్కు ఓటర్లలో శిరోమణి అకాలీదళ్‌కు గట్టి పట్టుందని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో హిందూ ఓటర్లు, వ్యాపార వర్గాలపై బీజేపీకి కొంతమేర ప్రభావం ఉంది. ఈ రెండు పార్టీలకు ఉన్న వేర్వేరు ఓటు బ్యాంకులు కలిస్తే ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీట్ల కేటాయింపుపై తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 18.56 శాతం ఓట్లు రాగా, శిరోమణి అకాలీదళ్‌కు 13.42 శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో అకాలీదళ్ ఒక లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య కుదిరిన తాజా పొత్తు పంజాబ్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది. అధికారంలోకి రావాలని ఆశిస్తున్న రాజకీయ పక్షాలకు ఈ పరిణామం కొత్త సవాలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ఓటర్లను సమన్వయం చేసుకుని ఉమ్మడి ప్రచారం నిర్వహించడం బీజేపీ, అకాలీదళ్‌కు కీలకం కానుంది. ఆరేళ్ల తర్వాత మళ్లీ కలిసిన ఈ రెండు పార్టీలు తమ పాత రాజకీయ బలాన్ని తిరిగి సాధిస్తాయా? పంజాబ్ ఓటర్లు ఈ కూటమికి ఎంతవరకు మద్దతు ఇస్తారు? అనేది రాబోయే ఎన్నికల్లో తేలనుంది.

Related News

Latest News