[t4b-ticker]

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

ప్రతిపక్షం, ఆగస్టు 07: వాయవ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

APSDMA సమాచారం ప్రకారం, వచ్చే రెండు రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.

అటు తెలంగాణలో కూడా వర్షాల తీవ్రత కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, అవసరం లేని ప్రయాణాలు తగ్గించాలని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు స్థానిక అధికారుల సూచనలను పాటించాలని సూచించారు.

నదులు, వాగులు, చెరువుల సమీపంలో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు వాతావరణ పరిస్థితులను పరిశీలించాలని అధికారులు తెలిపారు.

Spread the love

Related News

Latest News