[t4b-ticker]

విద్యుత్ ప్రమాద బాధితులకు శుభవార్త.. మరణ పరిహారం రూ.8 లక్షలకు పెంపు

ప్రతిపక్షం, జూలై 30, హైదరాబాద్: విద్యుత్ ప్రమాదాల్లో మరణించే సాధారణ పౌరుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) పెంచింది. ఎలక్ట్రికల్ విభాగంతో సంబంధం లేని వ్యక్తులు విద్యుత్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఇప్పటివరకు అందిస్తున్న రూ.5 లక్షల పరిహారాన్ని రూ.8 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ పెంపు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. కొత్త విధానం ప్రకారం మొత్తం పరిహారంలో రూ.7.20 లక్షలను బాధితుల వారసుల పేరుపై ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జమ చేయనుండగా, రూ.80 వేల నగదును నేరుగా అందజేయనున్నారు.

పశువులు విద్యుత్ ప్రమాదాలకు గురైన సందర్భాల్లోనూ పరిహారాన్ని కొనసాగించనున్నట్లు సంస్థ తెలిపింది. ఆవులు, గేదెలు, దున్నపోతులు చనిపోతే రూ.40 వేల, గొర్రెలు, మేకలు మృతి చెందితే రూ.7 వేల చొప్పున పరిహారం చెల్లించనున్నారు.

విద్యుత్ ప్రమాదాల్లో బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, తెగిపోయిన విద్యుత్ తీగల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలు కనిపించిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Spread the love

Related News

Latest News