ప్రతిపక్షం, ఆగస్టు 01: తెలంగాణలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఉత్తర తెలంగాణ జిల్లాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరద ముప్పును ఎదుర్కొంటుండగా, మరోవైపు దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాభావం తీవ్రంగా కొనసాగుతోంది. దీంతో ఒకే రాష్ట్రంలో వరద, కరవు పరిస్థితులు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
గత నాలుగు రోజులుగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు తదితర ఉత్తర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా జలాశయాలు, ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. పలు ప్రాంతాల్లో రాకపోకలు అంతరాయం కలగడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఇదే సమయంలో రాష్ట్రంలోని నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మేడ్చల్–మల్కాజిగిరి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాల్లో వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వరి, పత్తి, మిర్చి, ఇతర పంటలు ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతినగా, విత్తనాలు వేసిన పొలాల్లో తేమ లేక సాగు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు ఉత్తర జిల్లాల్లో మాత్రం అధిక వర్షాల కారణంగా నీట మునిగిన పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో అసమాన వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది. పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తున్న అధికారులు, రైతులు స్థానిక వాతావరణ సూచనలను అనుసరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

















