ప్రతిపక్షం, ఆగస్టు 07: హైదరాబాద్లో ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుండగానే సైబర్ మోసానికి గురై దాదాపు రూ.99 వేలకుపైగా కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరెంజ్ ట్రీ సమీపంలో నివసించే కృష్ణరామ్ (27) బాధితుడిగా గుర్తించారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 2వ తేదీ రాత్రి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుండగా ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రారంభమై ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయింది. అనంతరం మరుసటి రోజు ఉదయం తన బ్యాంక్ ఖాతాను పరిశీలించగా నాలుగు విడతల్లో మొత్తం రూ.99,018 బదిలీ అయినట్లు గుర్తించాడు.
దీంతో వెంటనే బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ మోసం కోణంలో దర్యాప్తు చేపట్టారు. నిధులు ఏ ఖాతాలకు బదిలీ అయ్యాయి? ఏ విధంగా లావాదేవీలు జరిగాయి? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
సైబర్ నిపుణుల సూచనలు: అనుమానాస్పద అప్డేట్లు, లింకులు లేదా యాప్లను క్లిక్ చేయకుండా ఉండాలి. బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సందేశాలు, లావాదేవీలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచడం ద్వారా ఇలాంటి మోసాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.





























