ప్రతిపక్షం, ఆగస్టు 15, జగిత్యాల: స్నేహితుడి ఫోన్ నంబర్ నుంచి వచ్చిన సందేశమే ఓ వ్యక్తికి భారీ నష్టాన్ని మిగిల్చింది. జగిత్యాల జిల్లాకు చెందిన అశోక్‌కు తన స్నేహితుడి నంబర్ నుంచి వాట్సాప్‌లో ఈ-చలాన్ పేరుతో ఏపీకే లింక్‌తో కూడిన సందేశం వచ్చింది. అది స్నేహితుడి నంబర్ కావడంతో అనుమానం రాక లింక్‌ను తెరిచారు.
లింక్‌ను ఓపెన్ చేసిన కొద్దిసేపటికే అశోక్ బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. రెండు విడతల్లో మొత్తం సుమారు రూ.4.15 లక్షలు సైబర్ నేరగాళ్ల ఖాతాలకు మళ్లినట్లు బాధితుడు తెలిపారు. ఇందులో ఒకసారి రూ.3.99 లక్షలు, మరోసారి రూ.15 వేల చొప్పున నగదు పోయినట్లు గుర్తించారు.
ఒక్కసారిగా ఖాతాలోని నగదు మాయమవడంతో అశోక్ షాక్‌కు గురయ్యారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
స్నేహితులు, పరిచయస్తుల నంబర్ల నుంచి వచ్చినా ఏపీకే ఫైళ్లు, అనుమానాస్పద లింకులు, ఈ-చలాన్ సందేశాలను పరిశీలించకుండా తెరవొద్దని పోలీసులు హెచ్చరించారు. గుర్తుతెలియని ఫైళ్లను డౌన్‌లోడ్ చేయడం, అనుమానాస్పద లింకులను తెరవడం ద్వారా ఖాతాలోని నగదు ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచించారు.





























