ప్రతిపక్షం, ఆగస్టు 04: హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో మహిళా ఉపాధ్యాయురాలిపై జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. సిక్రోనా గ్రామంలోని సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న 29 ఏళ్ల సంధ్యపై 21 ఏళ్ల అమిత్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఘటన జరిగిన రెండు గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం విధులకు వచ్చిన సంధ్యను కలవాలని చెప్పి పాఠశాల గేటు వద్దకు వచ్చిన అమిత్, ఆమె బయటకు రాగానే ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. మెడ, ఛాతీ, ముఖం, పొట్ట భాగాల్లో వరుసగా కత్తిపోట్లు పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పాఠశాల నిర్వాహకుడిని కూడా బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు.
తీవ్ర గాయాలతో ఉన్న సంధ్యను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన మొత్తం పాఠశాల సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అయితే దృశ్యాలు అత్యంత బాధాకరంగా ఉండటంతో వాటిని సోషల్ మీడియాలో పంచుకోవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రాథమిక దర్యాప్తులో, బాధితురాలు గతంలో తనపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడంపై పగతోనే అమిత్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

















