[t4b-ticker]

పాపం రైతు.. రూ.5 లక్షలు నేలపాలు! ఏడాది క్రితం దాచిన డబ్బు చివరకు చెదలపాలు

ప్రతిపక్షం, ఆగస్టు 10: రాజస్థాన్‌లో ఓ రైతుకు ఊహించని విషాద అనుభవం ఎదురైంది. దొంగల భయంతో భూమిలో దాచిన రూ.5 లక్షల నగదు.. ఏడాది తర్వాత బయటపడే సమయానికి చెదలు పట్టడంతో పనికిరాకుండా పోయింది. బ్యాంకుకు తీసుకెళ్లినా నోట్లపై సీరియల్‌ నంబర్లు కనిపించకపోవడంతో అధికారులు స్వీకరించేందుకు నిరాకరించినట్లు సమాచారం.

బలోత్రా ప్రాంతానికి చెందిన మంగీలాల్‌ మేఘ్వాల్‌ ఏడాది క్రితం తన ప్లాట్‌ను విక్రయించారు. ఆ లావాదేవీలో ఆయనకు సుమారు రూ.5 లక్షలు వచ్చాయి. అయితే నగదును ఇంట్లో ఉంచితే దొంగల భయం ఉంటుందని భావించిన మంగీలాల్‌.. ఆ మొత్తాన్ని భూమిలో ఓ చోట బ్యాగులో పెట్టి పాతిపెట్టారు.

ఆ తర్వాత కొంతకాలానికి డబ్బు దాచిన విషయం ఆయనకు గుర్తున్నప్పటికీ.. కచ్చితంగా ఏ ప్రదేశంలో పాతిపెట్టారో మర్చిపోయారు. దీంతో ఎంత వెతికినా నగదు దొరకలేదు. డబ్బు కోసం వెతకడం కూడా మానేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల తన భూమికి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసేందుకు మంగీలాల్‌ తవ్వకాలు చేపట్టారు. ఈ సమయంలో నేలలో ఓ బ్యాగు బయటపడింది. దాన్ని తెరిచి చూడగా అందులో తన డబ్బు ఉన్నట్లు గుర్తించారు. కానీ అప్పటికే నోట్లను చెదలు తీవ్రంగా దెబ్బతీశాయి. కొన్ని నోట్లు పూర్తిగా పాడైపోగా.. మరికొన్ని గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాయి.

అయినప్పటికీ మిగిలిన నగదును తీసుకుని మంగీలాల్‌ బ్యాంకును ఆశ్రయించారు. అయితే నోట్లపై సీరియల్‌ నంబర్లు స్పష్టంగా కనిపించకపోవడంతో వాటిని స్వీకరించేందుకు అధికారులు నిరాకరించినట్లు సమాచారం. దీంతో చేతికి అందినట్టే కనిపించిన రూ.5 లక్షలు ఇప్పుడు తనకు ఉపయోగపడకపోవడంతో రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

దొంగల నుంచి కాపాడుకోవాలని భూమిలో దాచిన డబ్బు.. చివరకు చెదల బారిన పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నగదును సురక్షితంగా ఉంచేందుకు బ్యాంకు వంటి అధికారిక మార్గాలను ఉపయోగించకుండా ఇలా భూమిలో దాచడం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి చెబుతోంది.

Spread the love

Related News

Latest News