ప్రతిపక్షం, ఆగస్టు 15: మైనారిటీలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఓ వర్గాన్ని కేవలం ‘స్కిల్డ్ లేబర్స్’గా పేర్కొనడం వివక్షపూరిత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుందని విమర్శించారు.
విద్య, ప్రతిభ ఏదైనా ఒక కులం లేదా మతానికి మాత్రమే పరిమితమని భావించడం సరైనది కాదని కేటీఆర్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు అజ్ఞానంతో పాటు భూస్వామ్య మనస్తత్వాన్ని బయటపెడుతున్నాయని మండిపడ్డారు. మైనారిటీ వర్గాల్లో ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, నిపుణులు ఉన్నారని పేర్కొన్నారు.
సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ అన్నారు. ఏ వర్గం పట్లా వివక్ష చూపకుండా ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయకుండా, అన్ని వర్గాల గౌరవాన్ని కాపాడాలని సూచించారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ చేసిన విమర్శలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి





























