[t4b-ticker]

తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవానికి బోనాలు ప్రతీక: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం, ఆగస్టు 09: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ లాల్‌దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు మెట్టు సాయికుమార్‌, సరితా తిరుపతయ్య యాదవ్‌, భాస్కర్‌, అజయ్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు, పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ ప్రియాంక ఆలా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఆషాఢ మాస బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలతో ప్రారంభమై, బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ కల్యాణం, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి జాతర, లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతో పాటు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయని చెప్పారు.

హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు వందల ఏళ్లుగా కొనసాగుతున్నాయని, గతంలో నిజాం పాలనలోనూ ఈ వేడుకలు నిర్వహించిన చరిత్ర ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, రైతులు, ప్రజలు ఆనందంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల జీవితాల్లో సంతోషం, సంపద వెల్లివిరియాలని ఆకాంక్షించారు. బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, మన సంస్కృతి వైభవానికి ప్రతీక అని అన్నారు.

బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. ఆలయాల వద్ద భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, ట్రాఫిక్‌ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. భక్తులు కుటుంబ సమేతంగా బోనాల వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

బోనాల సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో ఎక్కడ చూసినా డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, అమ్మవారి ఘటాలు, భక్తుల సందడి కనిపిస్తోందని మంత్రి అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బోనాల వేడుకలను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేస్తున్న హైదరాబాద్‌ ప్రజలు, భక్తులు, ఆలయ నిర్వాహకులు, అధికారులు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, సిరిసంపదలు కలగాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని ఆకాంక్షిస్తూ మరోసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love

Related News

Latest News