ప్రతిపక్షం, ఆగస్టు 04 ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయడం రాజ్యాంగబద్ధమైన విధేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అలాంటి కేసును నమోదు చేసిన డీసీపీ ఆనంద్‌బాబును తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేయడం చట్టాన్ని అమలు చేసిన అధికారిని శిక్షించినట్టేనని ఆయన విమర్శించారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డీసీపీని బదిలీ చేశారని ఆరోపించారు. చట్టప్రకారం పనిచేసే అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సోషల్ మీడియా సంస్థలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
అదే సమయంలో సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బొగ్గు బ్లాక్‌లను కేటాయించిందని కిషన్‌రెడ్డి ప్రకటించారు. నైనీ, తాడిచర్ల బ్లాక్-2తో పాటు మణుగూరు పీకేఓసీ (PKOC) బ్లాక్‌ను సింగరేణికి అప్పగించినట్లు తెలిపారు. ఈ బ్లాక్‌ల కోసం అనేక సంస్థలు వేలంలో పాల్గొనడానికి ఆసక్తి చూపినా, సింగరేణి భవిష్యత్తు, కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈ కేటాయింపులు చేసినట్లు వివరించారు.
కొత్త బొగ్గు బ్లాక్‌లతో సింగరేణి ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు సంస్థ ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు సింగరేణిని దోచుకున్నాయని ఆరోపించిన కిషన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వం మాత్రం సంస్థ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కొత్త గనుల కేటాయింపులు సింగరేణి సంస్థకు దీర్ఘకాలికంగా ఎంతో మేలు చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

















