[t4b-ticker]

సామాజిక న్యాయ తెలంగాణ దిశగా టీఆర్ఎస్​శంఖారావం

రేపు సరూర్‌నగర్‌లో ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’

పార్టీ ఎజెండాపై కవిత స్పష్టత ఇవ్వనున్నట్లు ప్రకటన

సామాజిక న్యాయ ఎజెండాపై కవిత ప్రసంగం

అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యమే పార్టీ విధానం

ప్రతిపక్షం స్టేట్​బ్యూరో, హైదరాబాద్, ఆగస్టు 05: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో భౌగోళిక తెలంగాణ సాకారమైనప్పటికీ, సామాజిక తెలంగాణ సాధన కోసం మరో ఉద్యమం అవసరమనే భావనతో ముందుకు సాగుతున్న తెలంగాణ రక్షణ సేన, రేపు (ఆగస్టు 6న) హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’ నిర్వహించనుంది. సరిగ్గా వంద రోజుల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రక్షణ సేన, సబ్బండ వర్గాల అభివృద్ధి, సాధికారత లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

సామాజిక న్యాయ ఎజెండాపై కవిత ప్రసంగం
సరూర్‌నగర్ సభ వేదికగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ సమగ్రాభివృద్ధి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీతో పాటు అట్టడుగు వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం పార్టీ చేపట్టనున్న కార్యాచరణపై స్పష్టత ఇవ్వనున్నట్లు పార్టీ పేర్కొంది. తెలంగాణలో సామాజిక న్యాయాన్ని కార్యరూపంలోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు.

‘భౌగోళిక తెలంగాణ తర్వాత సామాజిక తెలంగాణ’
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడిచినా అట్టడుగు వర్గాలపై వివక్ష పూర్తిగా తొలగిపోలేదని, సామాజిక అసమానతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలంగాణ రక్షణ సేన అభిప్రాయపడుతోంది. దేశంలోనే పిన్న వయస్సు గల రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినా, సామాజిక న్యాయం విషయంలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని పార్టీ నాయకత్వం చెబుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ వివక్షకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం సామాజిక తెలంగాణ కోసం కూడా పోరాటం కొనసాగాల్సిందేనన్న ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆలోచనలే తమకు స్ఫూర్తిగా నిలిచాయని పార్టీ పేర్కొంటోంది.

అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యమే పార్టీ విధానం
పార్టీ ఏర్పాటు తర్వాత ప్రకటించిన సంస్థాగత నియామకాలలో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలంగాణ రక్షణ సేన చెబుతోంది. 42 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీల్లో 22 మంది బీసీ నాయకులకు అవకాశం కల్పించగా, తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జీల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులకు ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపింది. మహిళ, విద్యార్థి విభాగాల వంటి కీలక అనుబంధ విభాగాల బాధ్యతలను కూడా బీసీ నాయకులకు అప్పగించినట్లు పేర్కొంది. భవిష్యత్‌లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మరింత ప్రాతినిధ్యం కల్పిస్తామని పార్టీ నాయకత్వం స్పష్టం చేస్తోంది.

గ్రామ స్థాయి వరకు విస్తరణే లక్ష్యం
సరూర్‌నగర్ సంకల్ప సభతో సామాజిక న్యాయ తెలంగాణ దిశగా తొలి రాజకీయ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ రక్షణ సేన పేర్కొంది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ సందేశాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేలా రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ భావజాలం, సామాజిక న్యాయ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభ కీలక వేదికగా మారనుందని నాయకులు భావిస్తున్నారు.

Spread the love

Related News

Latest News