[t4b-ticker]

రాజీనామా యోచనలో కొండా సురేఖ..? అధిష్ఠానం నిర్ణయానికి ముందే కీలక అడుగు

ప్రతిపక్షం, సెప్టెంబర్ 03: మంత్రి కొండా సురేఖ తదుపరి రాజకీయ కార్యాచరణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం తనపై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే మంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై సురేఖ నుంచి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

ఢిల్లీ పరిణామాల అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్న సురేఖ.. తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వారితో చర్చించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాభిప్రాయం మేరకే తన తదుపరి అడుగు ఉంటుందని సురేఖ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం.

తనపై పార్టీ అధిష్ఠానం తీసుకోబోయే నిర్ణయం కోసం ఎదురుచూడటంకంటే ముందుగానే రాజీనామా చేయాలా? అనే అంశంపై ఆమె ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కేవలం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ మాత్రమేనని, సురేఖ స్వయంగా ప్రకటించే వరకు దీనిని ఖరారు చేయలేమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు సురేఖ తన తదుపరి కార్యాచరణపై మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేయనున్న విలేకరుల సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో తన రాజకీయ భవిష్యత్తు, మంత్రి పదవిపై తన నిర్ణయం, అధిష్ఠానంతో జరిగిన చర్చల వివరాలను ఆమె వెల్లడించే అవకాశం ఉంది.

సురేఖ రాజీనామా చేస్తారా? అధిష్ఠానం నిర్ణయం కోసం వేచి చూస్తారా? లేక వివాదానికి ముగింపు పలికి మంత్రి పదవిలోనే కొనసాగుతారా? అన్నది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Spread the love

Related News

Latest News