[t4b-ticker]

పప్పు ధాన్యాల సాగుతో భూసారం పెంపు

*కంది పంటలో చీడపీడల నివారణపై ఆత్మ ఆధ్వర్యంలో క్షేత్ర ప్రదర్శన .

*చండూరు మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ .

ప్రతి పక్షం చండూరు సెప్టెంబర్ 01: రైతులు ఎప్పుడూ వరి, పత్తి పంటలే కాకుండా పప్పు ధాన్యాల పంటలు వేసుకోవడం ద్వారా భూమి యొక్క సారాన్ని కాపాడుకోవచ్చని, అలాగే అదనపు ఆదాయం పొందవచ్చని చండూరు మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ తెలిపారు.సోమవారం చండూరు మండలంలోని అంగడిపేట గ్రామంలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో పప్పు ధాన్యాలు మరియు కంది పంటలో వచ్చే చీడపీడల సమగ్ర నివారణ చర్యలపై క్షేత్ర ప్రదర్శన (Field Demonstration) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించారు.

*సూచనలు:

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మల్లేష్ మాట్లాడుతూ – ప్రస్తుతం కంది పంట మోకాలు ఎత్తు వరకు పెరిగిందని, ఈ దశలో రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుందని తెలిపారు.దీని నివారణకు రైతులు రసాయన మందులకు వెంటనే వెళ్లకుండా ముందుగా సేంద్రీయ పద్ధతిని పాటించాలని సూచించారు.మొదటి దఫా: వేప నూనె @ 5% చొప్పున పిచికారీ చేయాలి.
రెండవ దఫా: 10 రోజుల తర్వాత కూడా పురుగుల ఉధృతి తగ్గకపోతే ఎసిఫేట్ @ 250 గ్రాములు ఎకరానికి చొప్పున పిచికారీ చేసుకుంటే పంటను సమర్థవంతంగా కాపాడుకోవచ్చని వివరించారు.అలాగే ప్రస్తుతం వర్షాలు లేని కారణంగా భూమిలో తేమ శాతం తగ్గుతోందని, నీటి వసతి ఉన్న రైతులు తప్పనిసరిగా కంది పంటకు నీటి తడులు ఇవ్వాలని, లేకపోతే పూత, పిందె దశలో పంట దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.పప్పు ధాన్యాల సాగు వల్ల భూమిలో నత్రజని శాతం పెరిగి, తదుపరి పంటలకు మేలు జరుగుతుందని, రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచన చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి ఎం. జగన్, రైతులు జక్కలి ప్రవీణ్, పరమేష్ తదితర రైతులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News