ప్రతిపక్షం, సెప్టెంబర్ 01: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ (28) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బీర్భూమ్లోని తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. బ్రిస్టీ మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇటీవల పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న ఉపాధ్యాయ నియామకాల వివాదం నేపథ్యంలో బ్రిస్టీ ఉద్యోగం కోల్పోయిన వారిలో ఉన్నట్లు సమాచారం. ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత సుమారు 26 వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ పరిణామం బ్రిస్టీపై ప్రభావం చూపిందా? అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది.
అయితే బ్రిస్టీ ఆత్మహత్యకు ఉద్యోగం కోల్పోవడమే కారణమని ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. వ్యక్తిగత కారణాలు లేదా ఇతర పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
బ్రిస్టీ తండ్రి నిహార్ ముఖర్జీ.. మమతా బెనర్జీకి బంధువు కావడంతో ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.





























