ప్రతిపక్షం, ఆగస్టు 09: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివాసీ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని దైవంగా భావిస్తూ, అడవిని తల్లిగా కొలుస్తూ తమ సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సమాజాల గొప్పతనాన్ని కొనియాడారు.
ప్రపంచ నాగరికతకు ఆదివాసీ సంస్కృతి మూలమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకృతితో మమేకమైన వారి జీవన విధానం, ప్రకృతి పరిరక్షణకు వారు అందిస్తున్న ప్రాధాన్యం యావత్ మానవాళికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా ప్రకృతిని కాపాడుతూ వస్తున్న ఆదివాసీ సమాజాల జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, సమిష్టి జీవన విధానం ఎంతో విలువైనవని పేర్కొన్నారు.
ఆదివాసీల హక్కులు, అస్తిత్వం, సంస్కృతిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీఎం అన్నారు. వారి సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం, సమాజం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ సమాజాల హక్కులను పరిరక్షిస్తూ వారికి మెరుగైన అవకాశాలు కల్పించడమే నిజమైన సామాజిక న్యాయమని పేర్కొన్నారు.





























