[t4b-ticker]

సర్వాయి పాపన్న స్ఫూర్తితో తెలంగాణలో అధికారంలోకి వస్తాం: బండి సంజయ్

ప్రతిపక్షం, ఆగస్టు 18, కరీంనగర్: తెలంగాణ ఛత్రపతి శివాజీ మహారాజ్‌గా పేరుగాంచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో ఆయనకు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆయన సేవలను కొనియాడారు.

బహుజనులకు నిజమైన రాజ్యాధికారం అందించడమే సర్వాయి పాపన్న గౌడ్ ఆశయమని బండి సంజయ్ అన్నారు. సామాన్య వర్గాల నుంచి ఎదిగి ఆధిపత్య వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిన పాపన్న గౌడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

దేశంలో బహుజనులకు రాజ్యాధికారం కల్పించడం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమైందని బండి సంజయ్ అన్నారు. నరేంద్ర మోదీని దేశ ప్రధానిగా ఎన్నుకోవడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బహుజనులు, పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.

సర్వాయి పాపన్న గౌడ్ చూపిన పోరాట మార్గం, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని బండి సంజయ్ అన్నారు. బహుజనుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా పార్టీ పనిచేస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఆయన అన్నారు.

Spread the love

Related News

Latest News