ఈనెల 30న సీఎం పర్యటన

కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్వం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ పలు కార్యక్రమాలు

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, సెప్టెంబర్ 26: ఈనెల 30 వ తేదీన కరీంనగర్ , రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల లో నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పరిశీలించారు. బహిరంగ సభ ఏర్పాట్లపై అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్

ముఖ్యమంత్రి ఈ నెల 30వ తేదీన కరీంనగర్ జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అనంతరం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.ముఖ్యమంత్రి ఈ సందర్భంగా 33 నెలల ప్రజాపాలనలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారు. అదే సమయంలో సామాజిక న్యాయం, ప్రజాస్వామిక ఆకాంక్షలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడనున్నారు.ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నామన్నారు. “చలో సిరిసిల్ల” పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

మన 33 నెలల ప్రజా ప్రభుత్వం సంక్షేమ రంగంలోనే కాకుండా వ్యవసాయం, సాంకేతిక రంగం, మౌలిక వసతులు, సాగునీరు, విద్య, ఉపాధి తదితర అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి దిశగా అనేక చర్యలు చేపడుతోందన్నారు. సమీకృత అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.ప్రత్యేకంగా సిరిసిల్ల నేత కార్మికుల సమస్యలపై సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. నేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందనే భరోసాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో కూడా నేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అండగా నిలిచామన్నారు. నేడు రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా నేతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి నేతన్నల సంక్షేమం కోసం పనిచేస్తామని అన్నారు. కాబట్టి ఈ నెల 30వ తేదీన సిరిసిల్లలో జరిగే భారీ బహిరంగ సభకు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, ప్రజాస్వామిక ఆకాంక్షలు కలిగిన ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

Spread the love

Related News

Latest News