సిద్ధిపేటకు అంతర్జాతీయ ఖ్యాతి!
రామస్వామిని సన్మానించి అభినందించిన హరీశ్ రావు
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 28: కరాటేలో అసాధారణ ప్రతిభ కనబరిచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి సిద్ధిపేటకు చెందిన సందిరి రామస్వామి అరుదైన ఘనత సాధించారు. ఒకేసారి అత్యధిక మంది కరాటే చాప్స్ ప్రదర్శించిన కార్యక్రమంలో పాల్గొని అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఈ విజయంతో సిద్ధిపేట ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చేర్చిన రామ స్వామిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అభినందించారు.
రామ స్వామికి హరీశ్ రావు సన్మానం
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో రామస్వామి పేరు చోటు దక్కించుకోవడం పట్ల హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం రామస్వామి సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను హరీశ్ రావు శాలువాతో సన్మానించి అభినందించారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ
రామస్వామి సాధించిన ఘనత సిద్దిపేటకు గర్వకారణమని పేర్కొన్నారు. క్రీడా రంగంలో ప్రతిభను చాటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు.
810 మందితో కరాటే ప్రదర్శన
ఇటీవల చెన్నైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రామస్వామి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు పొందారు. వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ (డబ్ల్యూకేఎంఏ) ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో మొత్తం 810 మంది పాల్గొన్నారు. ఒకేసారి అత్యధిక మంది కరాటే చాప్స్ ప్రదర్శించడమే ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఇందులో సిద్దిపేటకు చెందిన రామస్వామి పాల్గొనడం విశేషం.క్రమశిక్షణ, సాధన, పట్టుదలతో కరాటేలో రామస్వామి సాధించిన ఈ గుర్తింపు ఆయన ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో సిద్దిపేటకు పేరు తీసుకురావడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.
మరిన్ని రికార్డులు సాధించాలి
రామస్వామికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయని హరీశ్ రావు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. కరాటే రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని అభిలషించారు. భవిష్యత్తులోనూ సిద్దిపేటకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.స్థానిక ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం యువతకు స్ఫూర్తిని ఇస్తుందని పేర్కొన్నారు. పట్టుదలతో లక్ష్యాన్ని సాధిస్తే ప్రపంచ స్థాయిలోనూ విజయాలు సాధించవచ్చని రామస్వామి ఘనత చాటి చెబుతోంది.





























