శంకరమఠంలో మూల నక్షత్ర మహోత్సవం వైభవం!
సప్త హారతులతో అమ్మవారికి విశేష పూజలు
భక్తులతో కిటకిటలాడిన ఆలయం
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబర్ 16: వీణను ధరించిన సరస్వతీ మాత రూపంలో కొలువుదీరిన శారదాంబ.. భక్తుల కుంకుమార్చనలు, వేదమంత్రాల నడుమ సాగిన విశేష పూజలు.. సప్త హారతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న శంకరమఠం.. ఇలా సిద్దిపేట సమీపంలోని కిష్టసాగర్ వద్ద ఉన్న శంకరమఠంలోని శృంగేరి దేవాలయం మూల నక్షత్ర మహోత్సవంతో భక్తిభావంతో పరవశించింది. మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం శారదా మాతను వీణాపాణి సరస్వతీ దేవి రూపంలో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి దివ్యమంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు.
వేద పండితుడు దీక్షితుల ఆధ్వర్యంలో శారదాంబకు సప్త హారతులు సమర్పించారు. అనంతరం సుహాసిని పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. సిద్దిపేటతో పాటు పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
విజయదశమికి చండీ హోమం
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శంకరమఠంలో ప్రతిరోజూ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మాధికారి కిషన్ సింగ్ తెలిపారు. విజయదశమి సందర్భంగా నిర్వహించే చండీ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మ వారి కృపకు పాత్రులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.






























