ప్రతిపక్షం, నవంబర్ 26: మహాత్మా జ్యోతిబా పూలే జీవిత చరిత్ర, ఆయన సామాజిక ఉద్యమాలు, సమానత్వ భావజాలాన్ని నేటి సమాజానికి పరిచయం చేసే గొప్ప ప్రయత్నం ‘ఫూలే’ సినిమా అని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పూలే ఆశయాలు నేటి తరానికి ఎంతో అవసరమని, ముఖ్యంగా సామాజిక న్యాయం, విద్యా సాధికారత, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన జీవితం మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
గురువారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ‘ఫూలే’ చిత్ర కథానాయకుడు ప్రతీక్ గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే జీవితాన్ని, ఆయన చేసిన సామాజిక సేవలను వెండితెరపై ఆవిష్కరించిన చిత్ర బృందాన్ని మంత్రి అభినందించారు. పూలే పాత్రలో నటించిన ప్రతీక్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయిన మహనీయుల జీవితాలను సినిమాల రూపంలో ప్రజలకు అందించడం ద్వారా వారి ఆలోచనలు, పోరాటాలు మరింత మందికి చేరువవుతాయని అభిప్రాయపడ్డారు.
మహాత్మా జ్యోతిబా పూలే తన జీవితమంతా కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. సమాజంలో అణచివేతకు గురవుతున్న వర్గాలకు సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అనేక ఉద్యమాలు చేపట్టారని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు విద్య అందించేందుకు పాఠశాలలను ప్రారంభించి, బాలికల విద్యకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆ కాలంలో మహిళల చదువుపై అనేక ఆంక్షలు, సామాజిక అడ్డంకులు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొని విద్యా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం పూలే గొప్పతనమని వివరించారు.
1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించి కులవివక్షకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం ఆయన సాగించిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని మంత్రి అన్నారు. అణగారిన వర్గాల హక్కులు, మహిళల గౌరవం, విద్యా అవకాశాలు, సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన కృషిని ‘ఫూలే’ చిత్రంలో చూపించారని తెలిపారు. ఆయన ఆలోచనలు కేవలం అప్పటి సమాజానికే పరిమితం కాకుండా నేటికీ ఎంతో ప్రాసంగికత కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.
బీసీల అభ్యున్నతి, సామాజిక సమానత్వం, విద్యా సాధికారత సాధించాలంటే మహాత్మా జ్యోతిబా పూలే చూపిన మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పూలే ఆశయాల స్ఫూర్తితో సామాజిక న్యాయం, వెనుకబడిన తరగతుల అభివృద్ధికి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. విద్య, ఉపాధి, సామాజిక అవకాశాల్లో వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించడం ద్వారా సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ‘ఫూలే’ సినిమాను వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించినట్లు మంత్రి తెలిపారు. గురువారం నుంచి తెలంగాణలో ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినిమాను తెలుగులోకి అనువదించిన డాక్టర్ పొన్నం రవిచంద్ర, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.



























