జెండర్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.. శబరిమల దర్శనంపై కేరళ సర్కార్ స్పష్టీకరణ

ప్రతిపక్షం, నవంబర్ 12: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ దర్శనం కోరుకునే ట్రాన్స్‌జెండర్ల విషయంలో కేరళ ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. తమిళనాడుకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ వ్యక్తి శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి కోరగా, అందుకు అవసరమైన లింగ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఆలయ ప్రవేశానికి అనుమతించడం సాధ్యం కాదని వెల్లడించింది. ఈ వ్యవహారంలో ఆలయ సంప్రదాయాలు, ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.

సంబంధిత వ్యక్తి లింగ గుర్తింపును ధ్రువీకరించే అధికారిక సర్టిఫికెట్‌ను సమర్పించిన తర్వాతే దర్శన అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సరైన పత్రాలు లేకుండా అనుమతులు మంజూరు చేస్తే ఆలయ ఆచారాలు, సంప్రదాయాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ విషయంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే గతంలోనూ పలువురు ట్రాన్స్‌జెండర్లు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన వ్యక్తి అభ్యర్థనతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అధికారిక పత్రాల పరిశీలన అనంతరం ఆలయ ప్రవేశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Related News

Latest News