ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరించాలి
కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన జాయింట్ సీపీ
కూకట్పల్లి, ప్రతిపక్షం,నవంబర్ 03: మైనర్లకు వాహనాలు ఇచ్చినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ నిర్వహణ, రికార్డుల పరిరక్షణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను తనిఖీ చేయడంతో పాటు ట్రాఫిక్ విధుల అమలు తీరుపై ఆరా తీశారు. విధి నిర్వహణలో సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. అనంతరం అధికారులతో ట్రాఫిక్ నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.
రహదారులపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు గుర్తించి అరికట్టాలని స్పష్టం చేశారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, ట్రాఫిక్ వ్యవస్థ మెరుగుదలకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ ట్రాఫిక్-2 శేషాద్రి రెడ్డి, ఏడీసీపీ ట్రాఫిక్-2 వీరన్న, కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ గిరిప్రసాద్, ట్రాఫిక్ సీఐ తిమ్మప్ప, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.





























