*ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు.
*వాహనదారుల ఇబ్బందులు – ప్రత్యక్షంగా పరిశీలించిన కూసుకుంట్ల.
*చలాన్ల పేరుతో వేధింపులు ఆపాలి – పరిష్కరించకుంటే ధర్నా అంటూ హెచ్చరిక
*తాత్కాలిక ప్రత్యామ్నాయ రోడ్లు వేయాలి – సీఐ, డీఎస్పీలకు సూచన
*మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.
ప్రతి పక్షం చౌటుప్పల్ నవంబర్ 01 : చౌటుప్పల్ జాతీయ రహదారిపై కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యలను మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా చౌటుప్పల్ పట్టణంలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుండటంతో ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, అత్యవసర పనులపై ప్రయాణించే వారు ట్రాఫిక్ సమస్యతో సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ట్రాఫిక్ సమస్యను నియంత్రించడంలో పోలీస్ శాఖకు చెందిన ట్రాఫిక్ సిబ్బంది సరైన సమన్వయంతో వ్యవహరించకపోవడం, ముందస్తు ప్రణాళికతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్లే సమస్య మరింత తీవ్రమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.ముఖ్యంగా చౌటుప్పల్‌లోని తంగడపల్లి వద్ద యూటర్న్ తీసుకోవాల్సిన వాహనదారులు, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా లింగోజిగూడెం వరకు వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీనివల్ల వాహనదారులు అదనపు దూరం ప్రయాణించడంతో పాటు మరింత ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తాత్కాలిక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని మినహాయించి, పనులు జరగని రహదారి ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేలా చిన్నపాటి ప్రత్యామ్నాయ రహదారులను తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని కోరారు. ట్రాఫిక్ పోలీసులు దూరదృష్టితో ఆలోచించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాహనదారులకు అడ్డగోలుగా ట్రాఫిక్ చలాన్లు విధించడం సరికాదని, రహదారి నిర్మాణ పనుల వల్ల ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో చలాన్ల పేరుతో మరింత ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు. ముందుగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి, వాహనదారులకు సౌకర్యాలు కల్పించడంపై అధికారులు దృష్టి సారించాలని హితవు పలికారు.ఈ విషయమై స్థానిక పోలీస్ అధికారులతో పాటు సీఐ తో మాట్లాడి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే డీఎస్పీ తో కూడా మాట్లాడి ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సమన్వయ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల ఇబ్బందులను అధికారులు తక్షణమే గుర్తించి పరిష్కరించాలని, ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాట్లు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలను అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రజల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగించడంతో పాటు ట్రాఫిక్ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని ఆయన స్పష్టం చేశారు.





























