పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజాపాలన

*పరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం .

ప్రతిపక్షం.కోహెడ, అక్టోబర్ 6: పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం పరివేద గ్రామంలో పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మంత్రికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి గ్రామంలోని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పరివేద గ్రామంలో ప్రజా సంక్షేమం – అభివృద్ధి కార్యక్రమాలు

పరివేద గ్రామంలో ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని మంత్రి వివరించారు.

  • గ్రామంలో 16 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, త్వరలో రెండో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
  • గ్రామంలో ఇప్పటికే 214 చేయూత పెన్షన్లు ఉండగా, కొత్తగా 26 మందిని గుర్తించడం జరిగింది.
  • 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కింద 281 మంది లబ్ధిదారులకు రూ.2.72 లక్షలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
  • 20 స్వయం సహాయక సంఘాలకు రూ.4.14 లక్షల వడ్డీలేని రుణాలు అందించగా, బ్యాంకు లింకేజీ కింద రూ.కోటి విడుదల చేసినట్లు తెలిపారు.
  • రైతు భరోసా కింద 545 మంది రైతులకు రూ.5.85 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
  • 13 మంది రైతులకు సన్న వడ్ల బోనస్ కింద రూ.2.44 లక్షలు అందించినట్లు తెలిపారు.
  • 10 కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.
  • 196 కొత్త రేషన్ కార్డులు మంజూరు కాగా, 101 కొత్త యూనిట్లు జత చేసినట్లు తెలిపారు.
  • రూ.10 లక్షలతో ఎంపీయూపీఎస్ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మించారు.
  • రూ.40 లక్షలతో కాలువలు, డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేశారు.
  • పరివేద నుంచి నకిరేకొమ్ముల ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు రూ.1.40 కోట్లతో రహదారి నిర్మాణం పూర్తి చేశారు.
  • రూ.20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మించారు.
  • రూ.28 లక్షలతో మంచినీటి పైప్‌లైన్, నీటి సదుపాయాలు కల్పించారు.
  • రూ.12 లక్షలతో విద్యుత్ సమస్యలు పరిష్కరించారు.
  • రూ.10 లక్షలతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల సమస్యలు పరిష్కరించారు.

పశువులకు నట్టల నివారణ మందులు, దాణా పంపిణీ

మంత్రి పొన్నం ప్రభాకర్ తొలుత గ్రామంలోని పశువుల దవాఖానను సందర్శించి పశువులకు నట్టల నివారణ మందులు, దాణా ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం రూ.20 లక్షల ఎంన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లను కుర్చీలపై కూర్చోబెట్టి శాలువాలతో సత్కరించారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి

గ్రామంలో జరిగే వివిధ కార్యక్రమాలకు ప్రజలు ఉపయోగించుకునేలా మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి అన్నారు. గ్రామంలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో స్టీల్ పాత్రలను వినియోగించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.

మహిళా సంఘాల స్టీల్ బ్యాంక్ కార్యక్రమంలో భాగంగా 275 మంది సభ్యులకు 300 స్టీల్ పాత్రలను పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. హోటళ్లలో వినియోగం కోసం టీ గ్లాసులను కూడా అందించినట్లు వివరించారు.

సమస్యల పరిష్కారానికి కార్యాచరణ

హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

పరివేద గ్రామంలో రోడ్ల సమస్యలను గుర్తించామని, వాటి పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామాల అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా నిలిపేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి

ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తుగా అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని, వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

గ్రామంలో నీటి సమస్య లేకుండా జలసిరి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

గ్రామానికి చెందిన రైతు గవ్వ రాజిరెడ్డి ఐదు ఎకరాల్లో సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ పంటను మంత్రి పరిశీలించారు. ఆయిల్‌పామ్ సాగుతో కోతుల బెడద, దొంగల భయం తక్కువగా ఉంటుందని, పంటను తరుగు లేకుండా విక్రయించుకునే అవకాశం ఉంటుందని, ఇతర పంటలతో పోలిస్తే నీటి అవసరం కూడా తక్కువగా ఉంటుందని రైతు తన అనుభవాలను మంత్రికి వివరించారు.

రైతులు ఆయిల్‌పామ్‌తో పాటు పట్టు, ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవాలని మంత్రి సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో రైతులకు అవగాహన కల్పించి, సుమారు 300 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పరివేద అభివృద్ధికి అదనంగా రూ.10 లక్షలుగ్రామ అభివృద్ధి కోసం అదనంగా రూ.10 లక్షల నిధులు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి, పరివేద గ్రామంలోని సుమారు 965 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు రూ.50 లక్షల నిధులు కేటాయించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.అలాగే పరివేద నుంచి హుస్నాబాద్ వరకు రూ.1.70 కోట్లతో నూతన రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు కొత్త చీరలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా, అర్హత మేరకు బిల్లులను వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

14 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు గర్భాశయ సంబంధిత వ్యాధుల నివారణకు అవసరమైన టీకాలు వేయించాలని మంత్రి సూచించారు. అవసరమైన మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు.

గ్రామంలోని ప్రజలందరికీ సుమారు 50 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించాలని అధికారులను ఆదేశించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామాలు తమ అవసరాలకు అనుగుణంగా సౌర విద్యుత్‌ను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. గ్రామంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని, మహిళా సంఘ భవనం సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమం చివరగా కసాబోయిన సుజాత, ఇరుముల రజితలకు కళ్యాణలక్ష్మి చెక్కులను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి , డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్య, జడ్పీ సీఈఓ రమేష్, పరివేద గ్రామ సర్పంచ్ మీద కొమురయ్య, డీపీఓ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News