ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయమే భారత్ సమ్మిట్‌ ప్రధాన లక్ష్యం: సీతక్క

ప్రతిపక్షం, నవంబర్ 13: భారత్ సమ్మిట్‌ సామాన్య ప్రజలు, రైతుల గొంతుకగా నిలిచే వేదిక అని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. ఇది కేవలం రాజకీయ నాయకుల సమావేశం కాదని, ప్రజల సమస్యలు, హక్కులు, ఆకాంక్షలను ప్రపంచ స్థాయిలో వినిపించేందుకు నిర్వహిస్తున్న ప్రజా సమ్మిట్‌ అని అభివర్ణించారు. శుక్రవారం సమ్మిట్‌ మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు, ప్రజాస్వామ్యవాదులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వివిధ దేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు, ఆయా దేశాల సార్వభౌమత్వం, స్వతంత్ర నిర్ణయాధికారంపై ఈ వేదిక ద్వారా చర్చించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, శాంతి, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం వంటి అంశాలకు భారత్ సమ్మిట్‌ ప్రాధాన్యం ఇస్తుందని వివరించారు.

ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక ప్రాంతంలో చోటుచేసుకునే పరిణామాలు ఇతర దేశాల ప్రజల జీవితాలపైనా ప్రభావం చూపుతున్నాయని సీతక్క అన్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు అంతర్జాతీయ చమురు ధరలు, వాణిజ్యం, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతున్నాయని, చివరకు వాటి భారం సామాన్య ప్రజలపై పడుతోందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశాలు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంతో పాటు స్వతంత్ర విదేశాంగ విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అనుసరించిన అలీన విధానం తరహాలో అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్ర నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచ రాజకీయ పరిణామాల మధ్య శాంతి, సహకారం, ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడంపై సమ్మిట్‌లో చర్చలు జరగనున్నాయని తెలిపారు.

భారత్ సమ్మిట్‌ను యాంటీ భారత్‌ సమావేశంగా చిత్రీకరించడం సరికాదని మంత్రి సీతక్క అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ ప్రజల గొంతుకను ప్రపంచానికి వినిపించేందుకు వివిధ దేశాల ప్రగతిశీల శక్తులను ఒకచోట చేర్చితే అది దేశ వ్యతిరేక కార్యక్రమం ఎలా అవుతుందని ప్రశ్నించారు. రైతుల శ్రమను అమెరికాకు తాకట్టుపెట్టిన మోదీనే యాంటీ భారత్‌ అని విమర్శించారు. గతంలో ఇవాంక ట్రంప్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చినప్పుడు బీఆర్‌ఎస్‌ యాంటీ భారత్‌ పార్టీ అయిందా అని ప్రశ్నిస్తూ ఆ పార్టీ వైఖరిపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాదం వంటి రాజ్యాంగ విలువలు బీజేపీకి నచ్చవని, ఆ పార్టీ మెప్పు పొందేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే భారత్ సమ్మిట్‌ ఉద్దేశాలను రాజకీయ విమర్శలతో ముడిపెట్టడం సరికాదని, ప్రజల సమస్యలపై చర్చించడమే ఈ వేదిక లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇక భారత్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించే తెలంగాణ రైజింగ్‌ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించనున్నట్లు సీతక్క వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి నమూనా, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలతో పాటు మహిళా సాధికారత, సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక న్యాయానికి సంబంధించిన విధానాలను వివరించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రపంచ ప్రతినిధులకు పరిచయం చేయడంతో పాటు తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మొత్తంగా ప్రజాస్వామ్యం, శాంతి, సమానత్వం, సామాజిక న్యాయం అనే అంశాలను కేంద్రంగా చేసుకుని భారత్ సమ్మిట్‌ ముందుకు సాగుతుందని మంత్రి సీతక్క వివరించారు.

Related News

Latest News